కుట్రల పట్ల పార్టీలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలిః జనసైనికులకు పవన్‌ పిలుపు

రాజకీయ వ్యవహారాల కమిటీ సూచనల మేరకు నడుచుకోవాలని స్పష్టీకరణ

pawan-kalyan-directed-janasena-cadre-what-to-do-and-what-not

అమరావతిః ఏపీ అభివృద్ధి, ప్రజాశ్రేయస్సు కోసం జనసేన పార్టీ శ్రమిస్తున్న తరుణంలో, జనసైనికుల దృష్టి మరల్చడానికి, జనసేన భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని శక్తులు నిరంతరం పనిచేస్తున్నాయని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వాటిని అర్థం చేసుకుని పార్టీ నాయకులు, శ్రేణులు ముందుకు వెళ్లాల్సి ఉందని తెలిపారు.

జనసేనతో కొన్ని పార్టీలు సానుకూలంగా ఉన్నాయని, జనసేన పట్ల ఆయా పార్టీలకు ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బతీసే కల్పిత సమాచారాన్ని జనసేన శ్రేణులకు చేర్చే కుట్రలకు పాల్పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం ఉందని పవన్ స్పష్టం చేశారు.

అందువల్ల పార్టీలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. తీవ్రమైన ప్రతి విమర్శలు, తీవ్రమైన ఆర్థిక నేరాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ముందుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని జనసేన పార్టీ శ్రేణులకు పవన్ సూచించారు. కమిటీ సూచనలు, సలహాల మేరకు జనసైనికులు మాట్లాడాలని పేర్కొన్నారు.

సూచనలు, సలహాల..

పార్టీలోని నేతలు, వీర మహిళలు, జనసైనికులు మాట్లాడే ప్రతి మాట పార్టీపై ప్రభావం చూపుతుంది.
మాట్లాడే ముందు వాస్తవాలు నిర్ధారించుకోవాలి.
స్థాయి, తీవ్రత హద్దులు దాటినట్టు సభ్య సమాజం భావించని రీతిలో మన మాటలు ఉండాలి.
ఒక వ్యక్తి గురించి మాట్లాడే సమయంలో అకారణంగా వారి కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావించవద్దు.
ఆధారాలు లేకుండా నేరారోపణలు చేయకండి… అది పార్టీకి, సమాజానికి కూడా మంచిది కాదు.
నన్ను విమర్శించే వారికి, వ్యక్తిగతంగా దూషించే వారికి బదులు చెప్పే సమయంలో నేను చాలా అప్రమత్తంగా ఉంటానన్న సంగతి మీ అందరికీ తెలిసిందే.
ప్రతి అక్షరాన్ని, ప్రతి మాటను బేరీజు వేసుకంటూ, హద్దులు దాటకుండానే, కొంత తగ్గి బదులు చెబుతాను.
ఎందుకంటే, మన నుంచి వచ్చే ప్రతి మాటకు అంత బలం ఉంటుంది. ఆ బలం మనకు ప్రతికూలం కారాదు.
నేనంటే ఇష్టంలేని వారికి కూడా శుభ సమయాలలో మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ప్రకటనలు చేస్తుంటాను… సమాజంలో సమతుల్యత, సుహృద్భావం నెలకొనేందుకే అలా చేస్తుంటాను.

ముఖ్యంగా ఈ విషయాలను మర్చిపోవద్దు…

.సరైన ఆధారాలు, అందుకు తగిన ధ్రువపత్రాలు లేకుండా ఎవరిపైన కూడా ఆర్థిక నేరారోపణలు చేయకండి.

.మీడియాలో వచ్చిందనో, లేదా, మరెవరో మాట్లాడారనో… నిర్ధారణ కాని అంశాల గురించి మాట్లాడొద్దు.

.సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారం ఆధారంగా పొత్తుల గురించి మాట్లాడొద్దు. పొత్తుల విషయంలో మేలు చేసే నిర్ణయం నేనే స్వయంగా తీసుకుంటాను.

.మనతో మంచిగా ఉండే పార్టీలలోని చిన్న చితకా నేతలు మనపై ఏవైనా విమర్శలు చేస్తే, అవి నాయకుని వ్యక్తిగత విమర్శలుగానే భావించండి. అంతేతప్ప, ఆ వ్యాఖ్యలను ఆయా పార్టీలకు ఆపాదించవద్దు…. అంటూ పవన్ కల్యాణ్ జనసైనికులు, వీరమహిళలకు స్పష్టమైన రీతిలో దిశానిర్దేశం చేశారు.