గుంటూరు ఘటన ఫై పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి

ఏపీలో టీడీపీ సభ అంటే ప్రజలు హడలిపోతున్నారు. సభకు పోవాలా..వద్దా అనే ఆలోచనలో పడుతున్నారు. దీనికి కారణంగా తాజాగా జరిగిన మరణాలే. మొన్నటికి మొన్న కందుకూరు లో చంద్రబాబు తలపెట్టిన సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మృతి చెందగా..పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన మరచిపోకముందే నిన్న గుంటూరు లో మరో ఘటన చోటుచేసుకుంది.

గుంటూరులో చంద్రబాబు జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించి వెళ్లిపోయిన అనంతరం తొక్కిసలాట నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. సభా వేదిక వద్ద ఒకరు మరణించగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

టీడీపీ, ఉయ్యురు ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట దురదృష్టకరమని అన్నారు. జనతా వస్త్రాలు, కానుకల కోసం వచ్చిన ముగ్గురు పేద మహిళలు మృత్యువాత పడటం దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని దైవాన్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.