అంశాల స్వామి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్

ఫ్లోరోసిస్ రక్కసిపై యుద్ధం చేసిన, ఫ్లోరోసిస్ బాధ నుండి విముక్తి కల్పించాలని డిమాండ్ చేసి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు నల్గొండ ఫ్లోరోసిస్ సమస్యను తెలియజేసిన అంశాల స్వామి (32) మృతి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ బారినపడ్డారు. ఫ్లోరైడ్ రక్కసిని తరమికొట్టాలని అవిశ్రాంతంగా పోరాడారు. ఫ్లోరైడ్ బాధితుల తరపున గళం వినిపించిన గొప్ప నాయకుడు. అలాంటి వ్యక్తి శుక్రవారం ట్రైసైకిల్ పైనుంచి కింద పడడంతో ఆయన తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స..అందిస్తుండగా శనివారం ఉదయం చికిత్స పొందుతూ మరణించారు.

స్వామి మృతి పట్ల మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు నేతలు విచారం వ్యక్తం చేయగా..తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం విచారం వ్యక్తం చేశారు. ఫ్లోరైడ్ విముక్త పోరాట నాయకుడు అంశాల స్వామి మరణం బాధాకరమని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావం నుంచి తమ ప్రాంతాన్ని విముక్తం చేయాలంటూ అంశాల స్వామి మూడు దశాబ్దాల సుదీర్ఘకాలం పాటు రాజీలేని పోరాటం చేశారని కొనియాడారు. స్వయంగా ఫ్లోరోసిస్ బాధితుడు అయినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తనవంటి బాధిత ప్రజల పక్షాన సొంత ప్రాంతం నుంచే పోరు మొదలుపెట్టి జాతీయస్థాయిలో గళం వినిపించారని పవన్ కల్యాణ్ వివరించారు.

అంశాల స్వామి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఆయన కుటుంబానికి తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు.