మొఘల్ గార్డెన్స్ కు పేరు మార్పు..

రాష్ట్రపతి భవన్‌లోని ప్రఖ్యాత మొఘల్ గార్డెన్స్ పేరును మార్చింది కేంద్రం. ఇప్పటి వరకు మొఘల్ గార్డెన్స్ పిలువబడగా..ఇక నుండి ‘అమృత్ ఉద్యాన్’గా పిలువబడుతుంది 75 సంవత్సరాల భారత స్వాతంత్రాన్ని పురస్కరించుకుని “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త పేరును పెట్టినట్లు డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా తెలిపారు.

75 వసంతాల స్వతంత్ర భారతావనిని దృష్టిలో ఉంచుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యాచరణను చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం… అందుకు అనుగుణంగానే మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్ గా మార్చినట్టు తెలుస్తోంది. ఇకపై సరికొత్త నామధేయంతో కొనసాగనున్న ఈ ఉద్యానవనాన్ని ద్రౌపది ముర్ము రేపు ప్రారంభించనున్నారు. కాగా, ప్రజల సందర్శన నిమిత్తం ఈ అమృత్ ఉద్యాన్ ను జనవరి 31 నుంచి మార్చి 26 వరకు తెరిచి ఉంచుతారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ ఉద్యానవనం పూర్తిగా వికసించిన రంగురంగుల పువ్వులతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ చార్ బాగ్ ను తనకు ఇష్టమైన తోటగా దీన్ని అభివర్ణించారు. తోటను బాగ్, బగీచా అని అంటారు పెర్షియన్లు. ప్రస్తుతం ఆగ్రాలో ఉన్న రామ్ బాగ్ మొట్టమొదటి చార్ బాగ్ అని కొందరి అభిప్రాయం. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో ఎన్నో మొఘల్ గార్డెన్స్ ఉన్నాయి. ఈ తోటల ప్రస్థావన బాబర్, హుమాయూన్, అక్బర్ ల జీవిత చరిత్రలలోనూ ఉంది. అలాగే యూరప్ కు చెందిన పర్యాటకులు భారత్ గురించి రాసిన “ది ఎకౌంట్స్ ఆఫ్ ఇండియా” వంటి పుస్తకాల్లోనూ ఈ తోటల గురించి ఉంది. కాన్స్ టెన్స్ విల్లియర్స్-స్టార్ట్ రాసిన గార్డెన్స్ ఆఫ్ ది గ్రేట్ మొఘల్స్(1913) అనేది మొఘల్ గార్డెన్స్ పై వచ్చిన మొట్టమొదటి పరిశోధనా గ్రంధం. ఈ రచయిత భర్త బ్రిటన్ కు చెందిన భారత సైన్యంలో కల్నల్ గా పనిచేసేవారు. వారు పింజోర్ గార్డెన్స్ లో నివసించేటప్పుడు ఆ మొఘల్ గార్డెన్ బాగోగులు చూసుకునే అవకాశం ఆమెకు దక్కింది. ఆమె పుస్తకంలో ఒక గార్డెన్ ను ప్రభుత్వ భవనంగా మార్చక ముందు దాని శైలి ఎలా ఉందో వివరించారు.