కాకినాడ నుండి పవన్ పోటీ..?

ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక పనిలో పడ్డాయి. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో భీమవరం , గాజువాక స్థానాల నుండి పోటీ చేసి ఓటమి చెందారు..మరి ఈసారి మళ్లీ ఆ స్థానాల నుండే పోటీ చేస్తారా…? లేక మరో చోట నుండి బరిలోకి దిగుతారా అనేది ఆసక్తిగా మారింది.

భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసినా పవన్ కల్యాణ్‌ను ఈసారి కచ్చితంగా గెలిపించుకుంటామని ఆయా నియోజకవర్గాల కార్యకర్తలు చెబుతున్నారు. అయితే కాకినాడ జిల్లా జనసేన పార్టీ నేతలు మాత్రం తమ వద్దనే పోటీ చేయాలని పవన్ కల్యాణ్‌ను కోరుతున్నారట. కాకినాడలో జనసేన కేడర్ భారీగా ఉందని, బలం కూడా ఉందని, ఈ సారి ఎన్నికల్లో కచ్చితంగా గెలిపించుకుంటామని ఇటీవల జరిగిన సమావేశాల్లో పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారట. అటు సామాజిక వర్గంగా కూడా పవన్ కల్యాణ్‌కు ఇక్కడ కలిసొచ్చే అంశంగా చెబుతున్నారట. మరి పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.