‘పద్మ’ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారికి పవన్ అభినందనలు

పేరుపేరునా అభినందించిన జనసేనాని

pawan-congratulates-those-selected-for-padma-awards

అమరావతిః కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన ‘పద్మ’ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అందరినీ పేరుపేరున అభినందించారు. కేంద్రం నిన్న మొత్తం 106 అవార్డులను ప్రకటించగా అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడుగురు , తెలంగాణ నుంచి ఐదుగురు ఉన్నారు.

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద విజ్ఞానాన్ని ఉపదేశించే చినజీయర్ స్వామి, రామచంద్ర మిషన్ ద్వారా సేవలు అందిస్తున్న ఆధ్యాత్మిక గురువు కమలేశ్ డి.పటేల్‌ను పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపిక చేయడం సంతోషకరమని పవన్ ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. సమతామూర్తి విగ్రహ స్థాపనతో చినజీయర్ స్వామి నవతరానికి చక్కటి సందేశాన్ని అందించారని, అలాగే, ‘జిమ్స్’ సంస్థ ద్వారా విద్య, వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగు సినిమా పాటను కీరవాణి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న సంఘ సేవకుడు డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్, గిరిజన భాషలపై పరిశోధనలు, నిఘంటువుల రూపకల్పనకు కృషి చేసిన తెలంగాణకు చెందిన భాషా శాస్త్రవేత్త బి.రామకృష్ణా రెడ్డికి పద్మశ్రీ పురస్కారం దక్కడంపై పవన్ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, సీవీ రాజు, అబ్బారెడ్డి నాగేశ్వరరావు, ఎం. విజయగుప్తా, డాక్టర్ పసుపులేటి హనుమంతరావు, కోట సచ్చిదానంద శాస్త్రికి అభినందనలు తెలియజేస్తున్నట్టు పవన్ తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/