రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై 42 పేజీల శ్వేతపత్రాన్ని విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

అరగంట టీ బ్రేక్‌ ఇచ్చిన స్పీకర్‌

Deputy CM Bhatti Vikramarka released a 42-page white paper on the financial situation of the state.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై 42 పేజీల శ్వేతపత్రాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. దీనిపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. అనంతరం సభను అరగంట పాటు వాయిదా వేశారు. శ్వేతపత్రంలోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర మొత్తం అప్పులు ₹6,71,757 కోట్లు. 2014-15 నాటికి రాష్ట్ర రుణం ₹72,658 కోట్లు. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5శాతం పెరిగిన అప్పు. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం ₹3,89,673 కోట్లు. 2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పం.

కాగా, తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది. సభ్యులకు 42 పేజీల పుస్తకాన్ని ఇచ్చి చర్చ ప్రారంభించింది. దాంతో బిఆర్‌ఎస్ సీనియర్‌ నేత హరీశ్‌రావు, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు అభ్యంతరం వ్యక్తంచేశారు. 42 పేజీల పుస్తకం ఇచ్చి రెండు నిమిషాల్లోనే చర్చ మొదలుపెడితే ఎలా మాట్లాడాలని ప్రశ్నించారు. ముందురోజే నోట్‌ ఇస్తే తాము ఏం మాట్లాడాలో ప్రిపేర్‌ అయ్యేందుకు అవకాశం ఉండేదని అన్నారు. నోట్‌ చదివేందుకు కనీసం ఒక గంట టీ బ్రేక్‌ అయినా ఇవ్వాలని అక్బరుద్దీన్‌ ఒవైసీ కోరారు. నోట్‌ ప్రిపేర్‌ అయ్యేందుకు రేపటి వరకు సమయం ఇస్తే బాగుంటుందని కూనంనేని అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో సభ్యులు తామిచ్చిన నోట్‌పై ప్రిపేర్‌ అయ్యేందుకు టీ బ్రేక్‌కు అనుమతిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. దాంతో స్పీకర్‌ టీ బ్రేక్‌ ప్రకటిస్తూ సభను అరగంట వాయిదా వేశారు.