మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్‌రెడ్డి

patnam-mahender-reddy-took-oath-as-minister

హైదరాబాద్‌ : కేబినెట్ మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ మహేందర్‌రెడ్డి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి‌ కెసిఆర్‌తో పాటు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సిఎం కెసిఆర్ తనకు రెండో సారి మంత్రి పదవీ అందించినందకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వికారాబాద్, తాండూరు జిల్లాలో బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. గతంలో తాను స్వల్ప తేడాతో రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయానని గుర్తు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. వాస్తవానికి రెండు, మూడు రోజుల కిందటే మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణం చేయాల్సి ఉంది. కానీ గవర్నర్ తమిళి సై పాండిచ్చేరిలో ఉండటంతో ప్రమాణ స్వీకారం ఈరోజు చేయాల్సి వచ్చింది.