రేపు జగనన్న చేదోడు కార్యక్రమం..

రేపు జగనన్న చేదోడు పథకం లబ్ధిదారుల అకౌంట్లోకి సీఎం జగన్ నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 25వేల లబ్దిదారులకు ప్రయోజనం చేకూరనుంది. రజన, నాయి బ్రాహ్మణ, టైలరింగ్ చేసే వారికి ప్రభుత్వం చేయూత అందించనున్నారు. ఒక్కొక్కరికి 10 వేల రూపాయల ఆర్ధిక సాయం జగన్ సర్కార్ చేస్తుంది. 325 కోట్ల రూపాయలను లబ్దిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి జమ చేయనున్నారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో జగనన్న చేదోడు పథకం నాలుగో విడత నిధులను బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గురువారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. ఎమ్మిగనూరు వీవర్స్‌ కాలనీ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని, జగనన్న చేదోడు పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.

ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన సీఎం పర్యటనకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభకు వచ్చే దారిలో గుంతలు లేకుండా రోడ్డుకు మరమ్మత్తులు, స్పీడ్ బ్రేకర్స్ తొలగించాలని ఆదేశించారు. దీంతో పాటు సభాప్రాంగణంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సభలో విద్యుత్ అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది, అంబులెన్స్ లను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. సభకు హాజరయ్యే జగనన్న చేదోడు పథకం లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా తాగునీరు, అల్పాహారం, భోజన వసతులు ఏర్పాటు చేయాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.