చంద్రయాన్-3 దిగిన ప్రదేశానికి శివశక్తి అని నామకరణం

చంద్రయాన్ 3 విజయవంతమైన నేపథ్యంలో ప్రధాని మోడీ..శనివారం బెంగుళూర్ లో ఇస్రో ఆఫీస్ లో శాస్త్ర‌వేత్త‌లతో సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల పర్యటన నుంచి వచ్చిన మోడీ నేరుగా ఇస్రో ఆఫీస్ కు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఇస్రో శాస్త్ర‌వేత్త‌లఫై ప్రశంసల్లో ముంచెత్తారు.

ఆగ‌స్టు 23వ తేదీని ఇక నుంచి జాతీయ అంత‌రిక్ష దినోత్స‌వం(National Space Day)గా నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్రకటించారు. అలాగే చంద్ర‌యాన్‌-3కి చెందిన విక్ర‌మ్ ల్యాండ‌ర్ దిగిన ప్రాంతాన్ని శివ‌శ‌క్తి(Shiv Shakti)గా నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు తెలిపారు. గతంలో ఎవరూ సాధించని విజయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సాధించారని ఈ సందర్బంగా తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత దేశం దూసుకెళ్తోందని చెప్పారు. మన దేశం ప్రపంచానికి దిక్సూచిగా మారిందన్నారు.

చంద్రయాన్-3లో మహిళలు తమ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారని తెలిపారు. చంద్రయాన్-3 కోసం మహిళలు చేసిన కృషి ప్రశంసనీయమని చెప్పారు. ప్రపంచంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలమని మనం నిరూపించామని తెలిపారు.

బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనడం కోసం తాను దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నప్పటికీ, తన మనసంతా చంద్రయాన్-3పైనే ఉందని తెలిపారు. ఇస్రో సాధించిన విజయం చాలా గర్వకారణమని తెలిపారు. ఈ విజయం అసాధారణమైనదని, అంతరిక్ష చరిత్రలో భారత్ సరికొత్త చరిత్రను సృష్టించిందని తెలిపారు. విజ్ఞానాన్ని మానవ కల్యాణం కోసం వినియోగించాలన్నారు. ‘‘మీ వైజ్ఞానిక సేవలకు గౌరవ వందనం చేస్తున్నాను’’ అని మోదీ చెప్పారు.