పటేల్‌ చాకచక్యం వలన నైజాం విలీనం

నేడు పటేల్‌ జయంతి

sardar vallabhbhai patel
sardar vallabhbhai patel

మనకు స్వాతంత్య్రం లభించిన 15 ఆగస్టు 1947 నాటికి భారతదేశంలో 554 సంస్థానాలుండేవి. అవన్నీ కూడా ఆయా రాజుల, నవాబుల, జాగీర్దారుల ఆధీనంలో ఉండేవి.

ఉపప్రధాని, హోం మినిస్టరుగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే సర్దార్‌ వల్లభాయి పటేల్‌ గుండెధైర్యంతో, పట్టుదలతో సమయస్ఫూర్తితో అన్ని సంస్థానాలను భారత్‌లో విలీనం చేశారు.

ఓ మూడు తప్ప. అవి ఒకటి జమ్మూకాశ్మీర్‌, రెండు గుజరాత్‌ రాష్ట్రంలోని జూనా ఘడ్‌, మూడవది మనదేశ నడిబొడ్డున ఉన్న నైజాం ఏరియా అంటే ప్రస్తుత తెలంగాణ.

మనకు స్వాతంత్య్రం ప్రకటించగానే జిన్నా జమ్మూకాశ్మీరు విషయంలో భారతదేశంలో కలిపినా కూడా స్వయం ప్రతిపత్తి ఉండాలని, జమ్మూకాశ్మీరుపై ఎటువంటి పెత్తనం అజమాయిషీ ఉండకూడదని ఈ విషయంలో పట్టు బట్టాలని జమ్మూకాశ్మీరులో ముస్లిం పెద్దలకు, మత చాందస వాదులకు నూరిపోశాడు.

పర్యవసానంగా ముస్లిం పెద్దలు 370 ఆర్టికల్‌తో కలపాలని పట్టుబట్టినారు.ఇక నైజాం నవాబు భారత దేశంలో అసలు కలపమని, కలిస్తే పాకిస్థాన్‌లో కలుస్తామని ప్రక టించాడు.

నైజాం నవాబు అండదండలతో జూనాఘడ్‌ నవాబు కూడా పాకిస్థాన్‌లో కలుస్తామని, భారత్‌లో అసలు కలవమని ప్రకటించాడు.

ఇటువంటి విపత్కరమైన, ప్రమాదకరమైన పరిస్థితి లో దేశంలోని రాజకీయ నాయకులకు, మేధావులకు శ్రేయోభిలా షులకు ఏం చేయాలో అర్థంకాలేదు.

చివరకు పెద్దలంతా సమావే శమై ఈ పరిస్థితిని చక్కపెట్టడానికి, మూడు ప్రాంతాలను భారత్‌లో విలీనం చేయగలిగే సత్తా, చాకచక్యం ఒక్క పటేల్‌కే ఉందని భావించి ఆయనకే అప్పజెప్పాలని తీర్మానించారు.

ఈ పనిని పటేల్‌ సునాయాసంగా చేస్తే ఆ ప్రతిఫలం ఆయనకే దక్కితే తను వెనుకబడిపోతానని భావించాడోఏమో! నెహ్రూ ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు.

జమ్మూకాశ్మీరు తన తాతల తండ్రుల రాష్ట్రం కనుక భారత్‌లో విలీనం చేసే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు.

పటేల్‌ సొంత రాష్ట్రం గుజరాత్‌ కనుక జూనాఘడ్‌ను కలిపే బాధ్యత పటేల్‌కు అప్పచెప్పాలని, ఇక మిగిలిన నైజాం విషయంలో మనం తలదూర్చకూడదని నెహ్రూ కూడా ఖరాఖండిగా చెప్పారు.

కొంత మంది ముఖ్యంగా ముస్లిం మత చాందసవాదులు నెహ్రూను సమర్థించారు.

మెజారిటీ నాయకులకు ఇష్టం లేకపోయినా, ప్రధానిగా నెహ్రూ మాటను కాదనలేకపోయారు. నూటికి 80 శాతం ముస్లింలు, 20 శాతం హిందువులు ఉన్న జూనాఘడ్‌ను ఎటువంటి షరతులు లేకుండా తన శక్తియుక్తులతో 20 రోజుల లోనే పటేల్‌ భారత్‌లో విలీనం చేశారు.

జమ్మూకాశ్మీరులో 75 శాతం ముస్లిం, 25శాతం హిందువులు ఉన్నారు.ముస్లిం చాందస వాదుల కోరికప్రకారమే 370ఆర్టికల్‌తో నెహ్రూ జమ్మూకాశ్మీర్‌ను విలీనం చేయించాడు.

అంటే జమ్మూకాశ్మీరు రాష్ట్రంపై ఎటువంటి పెత్తనం, అజమాయిషీ కేంద్రానికి ఉండదు.ఈ పరిణామంతో వేలాది మంది హిందూకాశ్మీరీ పండితులు పొట్టచేతపట్టుకొని ఇతర ప్రాంతాలకు వలసలుగాపోయారు.

ప్రపంచ పర్యాటక రంగంలో మొదటిస్థానంలో ఉండవలసిన జమ్మూకాశ్మీరు పాకి స్థాన్‌కు అత్తారిల్లుగా తయారైంది. ఉగ్రవాదులకు పుట్టినిల్లు అయింది.

గత 73 ఏళ్లుగా రావణకాష్టంలా కాలుతూ వచ్చింది. ఎంతో మంది మన జవానులు ప్రాణాలు కోల్పో యారు.

అంటే మన కంటిని మన చేతితోనే పొడుచుకున్నట్లయింది. దీనికంతటికి కారణం నెహ్రూనే అని అందరికి తెలుసు.

ఎంతో మంది ప్రధానులు వచ్చినా, 370 ఆర్టికల్‌ను రద్దు చేసే దమ్మూధైర్యం చూపలేక పోయారు. ఒక్క మోడీకే సాధ్యమైంది. అందుకే మోడీ పాకిస్థాన్‌కు సింహస్వప్నమైనాడు.

ఇక మిగిలింది నైజాం ఏరియా. నెహ్రూ ప్రకటనతో పట్టపగ్గాలు లేకుండాపోయాయి.

80 శాతం హిందువులు 20 శాతం ముస్లింలు ఉన్నా కూడా హిందువులు భయభ్రాంతులతో బతకవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

నైజాం ప్రధాన సైన్యాధికారికి రిజ్వి తన సైన్యం రజాకార్లతో తెలంగాణ అంతట హిందువుల బతుకులతో ఆటలాడుకున్నాడు.

అప్పుడప్పుడు ముఖ్యంగా నల్గొండ జిల్లాలో, వరంగల్‌ జిల్లాలో కమ్యూనిస్టులు ఎదురుతిరిగినా, సాయుధ పోరాటాలు జరిపినా బలం, బలగం తగినంత లేకపోవడం చేత ఫలితం లేకపోయింది.

వేలాది మంది హిందూ కుటుంబాలు పొట్ట చేతపట్టుకొని ఇతర రాష్ట్రాలకు పారిపోయారు.

రెండవది వేలాది మంది బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చబడ్డారు.ఈరెండూ కాదని ఎదురు తిరిగిన వేలాది హిందువులు రజాకార్ల చేతిలో చంపబడ్డారు.

ఇంతేకాకుండా పద్దెనిమిదేళ్ల పెళ్లికాని ఆడపిల్లలు అపహరించబడి ముస్లిం మతంలోకి మార్చుకొని, ఇద్దరిద్దరిని, ముగ్గురిముగ్గురిని పెళ్ళిళ్లు చేసుకున్నారు.

ఈ పరిణామాలన్నింటి వల్ల రోజురోజుకు హిందువుల జనాభా తగ్గుతూ ముస్లిం జనాభా గణనీయంగా పెరుగుతూ వచ్చింది.

కొంత మంది అగ్రకులస్తులు, ముఖ్యంగా దేశ్‌ముఖ్‌లు, పటేళ్లు, దొరలు నిజాంకు తొత్తులుగా మారి పదవులు అనుభవించడమే కాకుండా భూముల్ని వారి పేరున రాయించుకున్నారు.

ఆ రోజు 15.9. 1948 సూర్యపేట దగ్గర సోమవారం అనే గ్రామంలో 22 మంది హిందూస్త్రీలను వివస్త్రలు చేసి నగ్నంగా బతుకమ్మ ఆడించారు రజాకార్లు.చుట్టూ వందలమంది చూస్తూ రాక్షసానందంపొందారు.

సరిగ్గా అదే రోజు కేంద్రంలో ప్రధాని నెహ్రూ ఉపప్రధాని అయిన పటేల్‌ను పిలిచి 17.9.1948 నాడు రష్యాలో జరిగే సోషియల్‌ కాన్ఫరెన్స్‌కు తనకు బదులుగా హాజరు కమ్మని ఆజ్ఞాపించారు.

16.9.1948నాడు పటేల్‌ రష్యాకు వెళ్లడానికి తయారవుతుండగా హైదరాబాద్‌ నుండి వందేమాతరం రాంచంద్రరావు లాంటి నాయకుల నుండి ఫోన్లులో తెలంగాణలో రజాకార్ల దుశ్చర్యలను వివరించారు పటేల్‌కు.

అప్పుడు పటేల్‌ సమయస్ఫూర్తితో తీసు కున్న నిర్ణయమే నేడు తెలంగాణలో హిందువులు బతకడానికి కారణమైంది.

మహాభారత్‌ సంగ్రామంలో ద్రోణాచార్యుడి వీరవిహా రానికి పాండవ సైన్యం చనిపోతూ ఉంటే శ్రీకృష్ణుడు ఇక పాండవులు కూడా చనిపోతారనే భయంతో ధర్మరాజుచేత ‘అశ్వత్థామ హతహో..కుంజరహో అని అబద్ధం ఆడిస్తాడు.

తనకొడుకు చనిపోతే నాకెందుకీ యుద్ధం అని అస్త్రసన్యాసం చేయడంతో ద్రోణాచార్యుడు చంపబడ్డాడు.

అలాగే పటేల్‌ కూడా తెలంగాణ లోని పరిస్థితులు నెహ్రూకు చెపితే,మనకు అనవసరంఅంటాడని, అలా చెప్పకుండా తనకు గుండెనొప్పిగా ఉందని, రష్యాకు వెళ్లలే నని చెప్పాడు.

నెహ్రూను రష్యాకు విమానం ఎక్కించి తాను ఆపరేషన్‌ పోలో ప్రకటించి హైదరాబాద్‌కు నాలుగువైపుల నుండి సైన్యంచే చుట్టుముట్టించి 17.9.1948 నాడు ఉదయం నైజాంను ముట్టడి చేస్తాడు.

అప్పుడు నైజాం పటేల్‌ ముందు రెండు చేతులు జోడించి మోకారిల్లి లొంగిపోతాడు.

నైజాం ఏరియా మొత్తం భారత్‌లో కలిసిపోతుంది. అంటేనైజాం ఏరియా భారత్‌లో విలీనమవడానికి నూటికి నూరుపాళ్లు కారణం సర్దార్‌ వల్లభాయి పటేల్‌ చాతుర్యం, చాకచక్యం గుండెధైర్యం కారణం.

అందుకే ఆయనను ఉక్కుమనిషి అన్నారు. అఖండ సమైక్య భారత ఉక్కు పిడికిలి అన్నారు.

కొంత మంది కుహానా మతచాందస వాదులు పటేల్‌ను హిందూమత వాదిగా పేర్కొన్నారు.

ఏదిఏమైనా నేడు తెలంగాణలోని హిందువులు రుణపడి ఉంది ఒక్క సర్దార్‌వల్లభాయి పటేల్‌కు మాత్రమే అని చెప్పవచ్చు. ఆయన జయంతి సందర్భంగా మనం నివాళులు అర్పించడం తప్ప ఇంకేమీ చేయగలం.

  • మునిగంటి శతృఘ్నచారి
    (రచయిత : కార్యదర్శి, రాష్ట్ర బిసి సంఘం తెలంగాణ)

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/