అశాంతికి దారితీస్తున్న అమెరికా ఎన్నిక‌లు..జుకర్ బర్గ్

ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది..ఫేస్ బుక్ అధినేత

facebook ceo mark zuckerberg

వాషింగ్టన్‌: న‌వంబ‌ర్ 3వ తేదీన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ ఎన్నిక‌ల వ‌ల్ల దేశంలో అశాంతి, అల‌జ‌డి చెల‌రేగే ప్ర‌మాదం ఉంద‌ని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ అన్నారు. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ లో రాజకీయ ప్రకటనలను బ్యాన్ చేస్తున్నట్టు తెలిపారు.

గత ఎన్నికల సందర్బంగా కూడా పలు విషయాలు అలజడి రేకెత్తించాయని జుకర్ బర్గ్ చెప్పారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఓటర్లను ప్రభావితం చేయడం వంటి పనులు జరిగాయని తెలిపారు. ఇప్పుడు అలాంటివి మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని చెప్పారు. కఠిన పరీక్షను ఎదుర్కోవడానికి ఫేస్ బుక్ ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఎన్నికలను ప్రభావితం చేసిందనే అపప్రదను గత ఎన్నికల్లో ఫేస్ బుక్ ఎదుర్కొందని… ఈసారి మనపై అలాంటి ఆరోపణలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరిద్దామని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఎన్నికల ఫలితాలు రావడానికి ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని జుకర్ బర్గ్ తెలిపారు. ఫలితాలు ఆలస్యమయ్యే కొద్దీ జనాల్లో అశాంతి పెరుగుతుందని చెప్పారు. తమకు నచ్చిన నేతను ఎంచుకునే విషయంలో ప్రజల్లో స్పష్టమైన చీలిక కనిపిస్తోందని… ఇది ఆందోళనకరమని అన్నారు. దీనివల్ల ఓటర్లలో సామాజిక అశాంతి నెలకొనే ప్రమాదం ఉందని చెప్పారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/