పార్వతీపురం ఇంఛార్జ్‌ని మార్చేసిన చంద్రబాబు

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతూ..పార్టీ ఇంచార్జ్ లను మారుస్తున్నారు. పార్వతీపురం నియోజకవర్గం నుంచే ప్రక్షాళన మొదలుపెట్టారు. ఈ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నర్సిపురంకు చెందిన బోనెల విజయచంద్రను నియమించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు ఇంఛార్జ్‌గా ఉన్నారు. చిరంజీవులు 2014 ఎన్నికల్లో పార్వతీపురం నుంచి విజయం సాధించారు. 2019లో జోగారావు చేతిలో ఓడిపోయారు. చిరంజీవుల్ని తప్పించి విజయచంద్రకు నియోజకవర్గ బాధ్యతల్ని అప్పగించారు. బీటెక్‌ పూర్తిచేసిన విజయచంద్ర కార్పొరేట్‌ సెక్టార్‌లో కొన్నేళ్లు పనిచేసి.. తర్వాత వ్యాపారం వైపు మళ్లారు. చిన్నప్పటి నుంచి టీడీపీ అంటే అభిమానమని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు.

అలాగే విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంపైనా కూడా చంద్రబాబు సమీక్ష చేసారు. పార్టీ అభ్యర్థిని గెలిపించడమే ప్రధాన ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని.. టీడీపీకి కంచుకోటగా వున్న భీమిలిలో గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతోనే ఓటమి పాలయ్యామన్నారు. దీనికి కారణాలను చంద్రబాబు వివరించారు. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని.. అలాగని అలసత్వం వహించవద్దన్నారు. ఎన్నికలు ముగిసేంత వరకూ కష్టపడి పనిచేయాలని, భవిష్యత్తు మనదేనని ఆయన అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని అధిష్ఠానం గుర్తిస్తుందన్నారు. అధికార బలంతో ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలుపొందేందుకు వైఎస్సార్‌సీపీ పెద్దఎత్తున నకిలీ ఓట్లను సృష్టిస్తోందన్నారు. దీనిపై పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని.. ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.