ఇన్‌స్టాలో రీల్స్ మోజుతో కన్నబిడ్డను అమ్ముకున్న తల్లిదండ్రులు

8 నెలల కన్నబిడ్డను అమ్మి ఆ డబ్బుతో ఫోన్ కొనుగోలు

Couple in West Bengal sells their child to buy iPhone 14 for making reels on Instagram

కోల్‌కతాః సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి పాప్యులర్ కావాలనుకున్న భార్యాభర్తలు దారుణానికి తెగబడ్డారు. వీడియోలు రికార్డు చేసేందుకు ఐఫోన్ కొనాలనుకున్న వారు ఏకంగా కన్నబిడ్డనే అమ్మేశారు. పశ్చిమబెంగాల్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, ఉత్తర 24 పరగణాల జిల్లా పానిహతిలోని గాంధీనగర్‌కు చెందిన జయదేవ్, సాథీ దంపతులకు ఏడేళ్ల కుమార్తె, 8 నెలల కుమారుడు ఉన్నారు.

ఇటీవల కాలంలో వారు వివిధ ప్రాంతాలకు వెళుతూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తున్నారు. అయితే వారి పక్కన ఉండాల్సిన పసికందు జాడ కనిపించకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఏమైందని వారిని ప్రశ్నించగా బిడ్డను అమ్మేశామంటూ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా చెప్పేశారు. ఆ డబ్బుతో ఐఫోన్ కొనుగోలు చేసి దాంతో ఇన్‌స్టా రీల్స్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో, షాకయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు.