సరిహద్దుల్లో డ్రోన్ కేంద్రాలను ఏర్పాటు చేసిన పాక్

ఆయుధాలు, డ్రగ్స్ చేరవేత

న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. అక్కడి నుంచి డ్రోన్ల ద్వారా భారత్ లోకి డ్రగ్స్, ఆయుధాలు పంపించాలన్నది పాకిస్థాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ/గూఢచార సంస్థ) పన్నాగం. పాకిస్థాన్ రేంజర్స్ సమన్వయంతో ఇప్పటికే ఆరు డ్రోన్ కేంద్రాలను ఐఎస్ఐ ఏర్పాటు చేసింది. పంజాబ్ పక్కన అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో స్మగ్లర్లు, ఉగ్రవాదుల సాయంతో డ్రోన్ కేంద్రాలను ఐఎస్ఐ నిర్వహిస్తోంది. ఫిరోజ్ పూర్ నుంచి అమృత్ సర్ వరకు సరిహద్దు సమీపంలోని పోస్ట్ ల వద్ద పాకిస్థాన్ డ్రోన్ల కార్యకలాపాలపై తమకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందినట్టు సరిహద్దు భధ్రతా దళం (బీఎస్ఎఫ్) వర్గాలు వెల్లడించాయి.

‘‘ఆయుధాలు, డ్రగ్స్, పేలుడు పదార్థాల సరఫరా కోసం డ్రోన్లను పాకిస్థాన్ వినియోగిస్తోంది. సరిహద్దు బలగాల సహకారంతో డ్రోన్లను భారత్ లోకి పంపిస్తోంది’’ అని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో బీఎస్ఎఫ్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసుకుంటోంది. డ్రోన్లు కనిపించిన వెంటనే కూల్చివేసేందుకు సిద్ధమైంది. సరిహద్దుకు సమీపంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 53 డ్రోన్ల చొరబాట్లను బలగాలు గుర్తించాయి. గత మూడేళ్లలో పంజాబ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు 1,150 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/