రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 50 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రి జగన్‌ను కోరుకున్నారు

gvl narasimha rao
gvl narasimha rao

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై బిజెపి పోరాటం ఉంటుందని ఆ పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 50 శాతం మంది ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారన్నారు. అలాంటి ప్రభుత్వ అధికారంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. అదే విధంగా రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని, రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధాని పెట్టుకోవచ్చని జీవీఎల్‌ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పినా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జీవీఎల్‌ వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం అడ్డుకుంటోందని కొందరు భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని తాము స్పష్టంగా చెబుతున్నామన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశంపై కేంద్రం తొలిసారిగా స్పందించింది. రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోదేనని, ఈ విషయంలో రాష్ట్రాలదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/