పాక్ ప్రధాని ఇమ్రాన్ కు విశ్వాస పరీక్ష

ప్రకటించిన పాక్ విదేశాంగ మంత్రి
దిగువ సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆర్థిక మంత్రి

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు. దిగువ సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఆ దేశ ఆర్థిక మంత్రి ఓడిపోయారు. దీంతో విశ్వాస పరీక్ష అనివార్యమైందని పాక్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. అయితే, ఎప్పుడు పెట్టేది మాత్రం వెల్లడించలేదు. మరోవైపు 104 మంది సభ్యులున్న ఎగువ సభలో ప్రస్తుతం ప్రతిపక్షాల ఆధిపత్యం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖాళీ అయిన 37 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆయా స్థానాల్లో గెలిచి ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని అధికార పార్టీ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ), దాని మిత్రపక్షాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఎగువ సభకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది.

ఈ లోపే దిగువ సభ స్థానానికి జరిగిన ఎన్నికలో ఆర్థిక మంత్రి అబ్దుల్ హఫీజ్ షేక్ ఓడిపోయినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో దిగువ సభలో అధికార పార్టీ సంఖ్యా బలం ఒకటి తగ్గినట్టయింది. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారని విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషి వెల్లడించారు.

తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/