పాక్ కు అమెరికా సాయం

భారీ వరదలు పాక్ ను కోలుకోకుండా చేసాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నదులు ఉప్పొంగిప్రవహించడంతో పాక్ దాదాపు మూడు వంతులు మునిగిపోయింది. దీంతో తమకు సాయం అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని అడుగతోంది. ఐక్యరాజ్యసమితితో కలిసి విరాళాల కోసం అభ్యర్థిస్తోంది దాయాదిదేశం. పాకిస్తాన్ విజ్ఞప్తికి స్పందించిన అగ్రరాజ్యం అమెరికా 30 మిలియన్‌ డాలర్ల సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ కష్టసమయంలో పాక్‌కు అండగా నిలబడతామని అమెరికా విదేశాంగమంత్రి అంటోనీ బ్లింకెన్‌ ప్రకటించారు. ఆర్థిక సాయన్ని ఆహారం, పిల్లల పౌష్టికాహారం, తాగునీరు, ప్రజారోగ్య అవసరాలకు వాడుకునేలా పాక్ తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు అమెరికా ప్రతినిధులు పాకిస్థాన్ కు చేరుకున్నారు.

పాక్ లో వరదల వల్ల దాదాపు 33 మిలియన్ల మంది నిరాశ్రయులైనట్లు అమెరికా విదేశాంగశాఖ తెలిపింది. దాదాపు పదకొండు వందల మంది మరణించారు. పదహారు వందల మందికి పైగా గాయపడ్డారు. దాదాపు పది లక్షల నివాసాలు ధ్వంసమయ్యాయి. 8 లక్షల పశువులు చనిపోయాయి. పెద్ద ఎత్తున రోడ్లు, 20 లక్షల ఎకరాల్లో పంట నష్టానికి గురైంది.