సీఎం కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేసిన బీహార్ సీఎం నితీష్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ఈరోజు బీహార్ లో పర్యటిస్తున్నారు.భారత్-చైనా సరిహద్దు గాల్వాన్ ఘర్షణలో అమరులైన 10 మంది బీహార్ సైనికులకు బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి సీఎం కేసీఆర్ రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్బంగా నితీష్ కుమార్ మాట్లాడుతూ..అమరవీర సైనికుల కుటుంబాలను ఆదుకోవాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచన చాలా గొప్పదని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శ్లాఘించారు. కరోనా సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంతో సాయం చేసిందని గుర్తుచేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలాగా స్పందించలేదన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణలో మిషన్ భగీరథ పథకం చాలా గొప్పదని, ఆ పథకాన్ని ఎలా చేశారో చూసి రావాలని బిహార్ అధికారులను పురమాయించిన విషయాన్ని గుర్తుచేశారు. అన్ని గ్రామాల ప్రజలకు తాగునీరు అందించడం చాలా గొప్ప కార్యక్రమమన్నారు.

ఇక కేసీఆర్ మాట్లాడుతూ.. బీహార్‌లో చేపట్టే మంచి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. దేశం కోసం అమర జవాన్లు ప్రాణాలు అర్పించారని, వారి త్యాగం వెలకట్టలేనిదన్నారు. ప్రతి ఒక్క భారతీయుడు.. సైనికులకు అండగా ఉంటాడని తెలిపారు. కరోనా సమయంలో వలస కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారన్నారు. స్వగ్రామానికి చేర్చడానికి కార్మికుల కోసం రైళ్లను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ అభివృద్ధిలో బీహార్ వలస కార్మికులు భాగస్వాములయ్యారని, అలాంటి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.
బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి పాట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేసీఆర్.. నేరుగా బీహార్ సీఎం నీతీశ్ కార్యాలయానికి వెళ్లారు. కేసీఆర్‌కు నీతీశ్‌తో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఘనస్వాగతం పలికారు.