భారీ వరదలతో అల్లాడిపోతున్న పాక్..సాయం కోసం భారత్ వైపు ఎదురుచూపు

భారీ వరదలు పాకిస్థాన్ ను కోలుకోకుండా చేసాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నదులు ఉప్పొంగిప్రవహించడంతో పాక్ దాదాపు మూడు వంతులు మునిగిపోయింది. వరదల కారణంగా పంట దిగుబడి తగ్గే అవకాశం ఉండటంతో.. భారత్ నుంచి పంటలను దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం పాకిస్థాన్ సంకీర్ణ సర్కారు భాగస్వామ్య పక్షాలతో సమాలోచనలు జరుపుతోంది. పొరుగునే ఉన్న భారత్ నుంచి ఆహార పదార్థాలను తీసుకొచ్చేందుకు వీలు కల్పించాలని అంతర్జాతీయ ఏజెన్సీలు పాక్ ప్రభుత్వాన్ని కోరాయి. ఆహార పదార్థాల సరఫరా, కొరతను బట్టి.. మా భాగస్వాములతో చర్చించి, భారత్ నుంచి దిగుమతి చేసుకోవాలా వద్దా అనే విషయమై నిర్ణయం తీసుకుంటాం’ అని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ ట్వీట్ చేశారు.

మరోపక్క ఐక్యరాజ్యసమితితో కలిసి విరాళాల కోసం అభ్యర్థిస్తోంది దాయాదిదేశం. పాకిస్తాన్ విజ్ఞప్తికి స్పందించిన అగ్రరాజ్యం అమెరికా 30 మిలియన్‌ డాలర్ల సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ కష్టసమయంలో పాక్‌కు అండగా నిలబడతామని అమెరికా విదేశాంగమంత్రి అంటోనీ బ్లింకెన్‌ ప్రకటించారు. ఆర్థిక సాయన్ని ఆహారం, పిల్లల పౌష్టికాహారం, తాగునీరు, ప్రజారోగ్య అవసరాలకు వాడుకునేలా పాక్ తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు అమెరికా ప్రతినిధులు పాకిస్థాన్ కు చేరుకున్నారు.