అమెరికా-భారత్ సంయుక్త ప్రకటనపై పాక్ అభ్యంతరం

ఇది తప్పుదారి పట్టించేదిగా ఉందని మండిపాటు

Pak reacts to tough Indo-US joint statement on cross-border terrorism

ఇస్లామాబాద్‌ః పాక్ భూభాగం ఉగ్రవాద స్థావరం కాకూడదంటూ అమెరికా, భారత్ ప్రభుత్వాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై పాక్ ప్రభుత్వం తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రకటన అనవసరం, ఏకపక్షమే కాకుండా తప్పుదారి పట్టించేలా ఉందంటూ పాకిస్థాన్ విదేశాంగ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అనవసరంగా పాక్ ప్రస్తావన తేవడం దౌత్య సంప్రదాయాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది.

‘‘సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాదులను ప్రచ్ఛన్న దాడులకు వాడుకోవడాన్ని బైడెన్, మోదీ ఇద్దరూ ఖండించారు. పాక్ భూభాగం ఉగ్రకార్యకలాపాలకు స్థావరం కాకుండా తక్షణం అడ్డుకోవాలని పాక్ ప్రభుత్వాన్ని కోరారు’’ అంటూ అమెరికా, భారత్‌లు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

అంతకుమునుపు, అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ ఉగ్రవాదంతో పొంచి ఉన్న ప్రమాదంపై సభికులను అప్రమత్తం చేశారు. ఉగ్రవాదం విషయంలో ఎటువంటి సాకులకూ స్థానం లేదని తేల్చి చెప్పారు. ‘‘9/11 దాడులు జరిగి రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. 26/11 దాడులు జరిగి దశాబ్దానికి పైనే అయ్యింది. కానీ ఉగ్రవాదంతో ఇప్పటికీ ప్రపంచానికి ముప్పు పొంచి ఉంది. ఈ భావజాలం కొత్త రూపురేఖలు సంతరించుకున్నా దాని ఉద్దేశాలు మాత్రం పాతవే’’ అంటూ మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.