ఇది ఆరంభం మాత్రమే : త్వరలో భవిష్యత్ కార్యాచరణ

కేంద్రం పై నిప్పును చెరిగిన కెసిఆర్: మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ

KCR meets Maharashtra CM Uddhav Thackeray
KCR meets Maharashtra CM Uddhav Thackeray

Mumbai: ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ మేరకు తాము ముంబై వేదికగా అడుగులు వేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏక‌తాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశానికి బీజేపీ, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ రాజ‌కీయ‌ వేదిక ఏర్పాటు కావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ చ‌ర్చలు ఆరంభం మాత్రమేనని కేసీఆర్ అన్నారు. మున్ముందు పురోగ‌తి వ‌స్తుంద‌న్నారు. త్వర‌లోనే అన్ని ప్రాంతీయ పార్టీల‌తో పాటు జాతీయ పార్టీలతో స‌మావేశ‌మై భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ‌ను ప్రక‌టిస్తామ‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆదివారం ముంబై పర్యటనలో భాగంగా మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో స‌మావేశం అయ్యారు.

KCR meets Maharashtra CM Uddhav Thackeray-

ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆయన కేబినెట్ మంత్రులు, నేతలతో సమావేశమయ్యారు. సినీ నటులు ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు.ముంబైలోని సీఎం అధికారిక నివాసం వర్ష బంగ్లాలో ఈ భేటీ జరిగింది. అనంత‌రం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశ రాజ‌కీయాల‌పై చ‌ర్చించేందుకే మ‌హారాష్ట్రకు వ‌చ్చానని అన్నారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాల‌పై చ‌ర్చించామన్నారు. కేంద్ర సంస్థల‌ను బీజేపీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. వైఖ‌రి మార్చుకోకుంటే బీజేపీకి ఇబ్బందులు త‌ప్పవని హెచ్చరించారు. శివసేన అధ్యక్షుడు ఠాక్రే గత వారం కేసీఆర్‌కు ఫోన్ చేసి ముంబైకి ఆహ్వానించిన విషయం తెలిసిందే.

అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/