మరోసారి బిజెపి -టీడీపీ – జనసేన పార్టీలు కలవబోతున్నాయి – పవన్ కళ్యాణ్

రాబోయే ఎన్నికల్లో జనసేన , టీడీపీ , బిజెపి పార్టీలు కలిసి పోటీచేయబోతాయని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఢిల్లీ లో బిజీ గా ఉన్నారు. ఎన్డీయే సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ కి చేరుకున్న ఆయన సమావేశంలో పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మాట్లాడుతూ… ఏపీలో ఎన్నికల పొత్తులపై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేశామని.. ఆ సమయంలో కలిశానని, 2019లో వేర్వేరుగా పోటీ చేశామని గుర్తు చేశారు. 2020 లో జనసేన , బిజెపి కలిసినట్లు తెలిపారు. ఇక రాబోయే ఎన్నికల్లో మరోసారి టీడీపీ – జనసేన – బిజెపి కలిసి పోటీచేస్తాయని అన్నారు. ఇక సీఎం ఎవరు అనేది అప్పటి పరిస్థితి బట్టి తెలుస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీ ని గద్దె దించడమే లక్ష్యం అన్నారు.

ఇక పవన్ కామెంట్స్ ఫై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ వెళ్లడాన్ని నారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్డీఏ కూటమి సమావేశానికి పవన్ ఎందుకు వెళ్లారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అతివాదం నుంచి మితవాదుడైన సవర్కర్ పాలసీలోకి వెళ్లడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డులతో పోల్చిన పవన్ కళ్యాణ్ నేడు ఎన్డీఏలో ఎలా చేరుతున్నారో చెప్పాలంటూ మండిపడ్డారు.