జూన్ రెండో వారం నాటికి తెలంగాణ లో కరోనా ఫోర్త్ వేవ్..

దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వరుసగా రెండో రోజు 3వేలపైగా కేసులు నమోదయ్యాయి. గత నెల వరకు కూడా కరోనా కేసులు పెద్దగా లేవు..కానీ ఈ నెలలో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ లో అయితే కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. కాగా తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా ఫోర్త్ వేవ్ వ్యాప్తి చెందే అవకాశమున్నట్లు ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతున్నాయి.

జూన్ రెండో వారం నాటికి కరోనా ఉధృతి పెరిగే అవకాశముందని భావిస్తోంది. ప్రస్తుతం రోజుకు 40 పాజిటివ్ కేసులు నమోదవుతుండగా.. జూన్ రెండో వారం నాటికి 2,500 నుంచి 3 వేల కేసులు నమోదయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. కరోనా పాజిటివిటీ రేటు గత వారంతో పోలిస్తే రెట్టింపు అయినట్లు చెపుతున్నారు. కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. బయటికి వెళ్లేటప్పుడు మాస్కులు ధరించడం.. వ్యాక్సిన్లు వేయించుకోని వారు వెంటనే వేయించుకోవాలని సూచించింది.

ఇక దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 4,73,635 మందికి నిర్ధారణ పరీక్షలు చేపట్టగా.. 3,377 మందికి వైరస్ పాజిటివ్‌ తేలింది. అలాగే, మహమ్మారి నుంచి మరో 2,496 మంది కోలుకున్నారు. ఇక, ముందు రోజుతో పోల్చితే కేసులతో పాటు మరణాలు పెరిగాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 60 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ దేశంలో 5,23,753 మంది కరోనాకు బలయ్యారు.