మునుగోడు ఎమ్మెల్యే గా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం

మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు. శాసనసభలోని తన చాంబర్‌లో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఉదయం అసెంబ్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 104 కు చేరింది. మజ్లిస్ కు ఏడుగురు, కాంగ్రెస్ కు ఐదుగురు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు.

ఈ నెల 3న జరిగిన మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ..బిజెపి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిపై 10 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ విజయం తో టిఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషాన్ని నింపింది. ఈ మునుగోడు ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిషాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. నెల రోజుల పాటు మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేసారు. వందల కోట్లు ఖర్చు చేసారు. ఓటుకు దాదాపు మూడు నుండి ఐదు వేలు పంచినట్లు తేలింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఉప ఎన్నిక చివరకు టిఆర్ఎస్ కు పీఠం దక్కింది.