రాష్ట్రంలో ఒమిక్రాన్​ కేసులపై స్పందించిన మంత్రి హరీశ్

ఒమిక్రాన్​ సోకిన మరో వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నాం..మంత్రి హరీశ్

హైదరాబాద్ : తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు బయటపడిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఒమిక్రాన్ కేసులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఇది ఎట్ రిస్క్ (ముప్పు జాబితాలోని) దేశాల నుంచి వచ్చిన వారిలో ఈ కేసులు రాలేదని, వేరే దేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్ గా తేలిందని ఆయన చెప్పారు. నిన్న రాత్రి ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని, వెంటనే వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారని తెలిపారు.

పాజిటివ్ వచ్చిన తలీబ్ ఇక్రాన్ అనే మహిళను వెంటనే టిమ్స్ ఆసుపత్రికి తరలించారని చెప్పారు. 23 ఏళ్ల అబ్దుల్లా అహ్మద్ అనే యువకుడిని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నామని, ఇటు వైద్యశాఖ అధికారులు అటు పోలీసులు అతడి ఆచూకీ కోసం వెతుకుతున్నారని హరీశ్ వెల్లడించారు. ఇప్పటిదాకా నమోదైన కేసులను చూస్తే వ్యాధి తీవ్రత తక్కువగానే ఉందని చెప్పారు. అయితే, వ్యాధి వ్యాప్తి మాత్రం ఎక్కువగా ఉందని వివరించారు. బ్రిటన్ లో రెండు మూడు రోజుల్లోనే కేసులు రెట్టింపవుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం సిద్ధమైందని హరీశ్ వివరించారు. అందరూ దయచేసి వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీకా వేస్కోవడం, మాస్కు పెట్టుకోవడం వంటి వాటితోనే దానిని ఒమిక్రాన్ వ్యాప్తిని నియంత్రించగలుగుతామని సూచించారు. జనసమ్మర్థ ప్రాంతాలకు ఎక్కువగా వెళ్లొద్దని, ఎక్కడా గుమిగూడకూడదని స్పష్టం చేశారు. ముందుజాగ్రత్తగా 21 లక్షల హోం ఐసోలేషన్ కిట్లను సిద్ధం చేసి పెట్టుకున్నామని, ఆక్సిజన్ కొరత రాకుండా చూస్తున్నామని హరీశ్ తెలిపారు. బెడ్లనూ సిద్ధం చేశామన్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ప్రజలకు సూచించారు. ఒమిక్రాన్ కట్టడికి ప్రజల నుంచి కూడా సహకారం అవసరమన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/