ఒమిక్రాన్‌తో వ‌చ్చే వ్యాధులు మ‌రీ ప్ర‌మాద‌క‌రంగా లేవు : డ‌బ్ల్యూహెచ్‌వో

జెనీవా: గ‌త కోవిడ్ వేరియంట్లతో వ‌చ్చిన వ్యాధుల క‌న్నా.. ఒమిక్రాన్‌తో వ‌చ్చే వ్యాధులు మ‌రీ ప్ర‌మాద‌క‌రంగా ఏమీలేవ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. టీకా ర‌క్ష‌ణ‌ను పూర్తిగా దాటివేసే శ‌క్తి ఒమ్రికాన్‌కు లేద‌న్న అభిప్రాయాన్ని డ‌బ్ల్యూహెచ్‌వో వినిపించింది. కానీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో అధికారి తెలిపారు. అయితే డెల్టా లేదా ఇత‌ర‌ వేరియంట్ల‌ క‌న్నా ప్ర‌మాద‌క‌ర‌రీతిలో ఒమిక్రాన్ లేద‌ని ప్రాథ‌మిక స‌మాచారం ద్వారా తెలుస్తోంది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఎమ‌ర్జెన్సీ డైర‌క్ట‌ర్ మైఖేల్ ర్యాన్ తెలిపారు.

ప్రిలిమిన‌రీ డేటా ఆధారంగా ఒమిక్రాన్ సీరియ‌స్‌గా లేద‌ని తెలుస్తోంద‌ని, కానీ దీనిపై మ‌రింత అధ్య‌య‌నం జ‌ర‌గాల్సి ఉంద‌ని మైఖేల్ ర్యాన్ చెప్పారు. ఇప్పుడిప్పుడే ఒమిక్రాన్ గురించి తెలుస్తోంద‌ని, పూర్తి స‌మాచారం అందే వ‌ర‌కు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆయ‌న అన్నారు. ఓ అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాన్ని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ల ద్వారా క‌లిగే ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను ఒమ్రికాన్ దాటివేస్తుంద‌న్న ఆధారాలు కూడా ఏమీలేవ‌ని ఆయ‌న అన్నారు. మ‌న వ‌ద్ద ప్ర‌భావంత‌మైన వ్యాక్సిన్లు ఉన్నాయ‌ని, అన్ని వేరియంట్ల‌పై అవి ప్ర‌భావం చూపాయ‌ని ఆయ‌న అన్నారు. వ్యాక్సిన్ వేసుకోవ‌డ‌మే మెరుగైన ఆయుధ‌మ‌న్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/