ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో 11 కి చేరిన మృతుల సంఖ్య

తమిళనాడులోని కూనూర్ లో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో 11 మంది మృతి చెందినట్లు సమాచారం. వాస్తవ పరిస్ధితి తెలుసుకునేందుకు కూనూర్ హెలికాఫ్టర్ ప్రమాద ఘటనా స్ధలికి రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పాటు పలువురు మంత్రులు, తమిళనాడు సీఎం స్టాలిన్ కాసేపట్లో వెళ్లనున్నారు. నీలగిరి కొండల్లో ప్రమాదానికి గురైన ఆర్మీ హెలికాఫ్టర్ లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ తో పాటు మొత్తం 14 మంది ప్రయాణించినట్లు ఆర్మీ ధృవీకరించింది. తమిళనాడులోని వెల్లింగ్టన్ డిఫెన్స్ కాలేజీలో జనరల్ రావత్ ప్రసంగానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదానికి గురైన రష్యా మేడ్ ఎంఐ 17 వీ65 హెలికాఫ్టర్ లో ప్రయాణించిన 14 మందిలో ఇద్దరు దాన్ని నడపగా మరో 12 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 11 మంది ప్రమాదంలోనే చనిపోయినట్లు గుర్తించారు. మిగతా వారిని తీవ్ర గాయాలతో స్ధానిక వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. వీరంతా దాదాపు 80 శాతం గాయాలపాలైనట్లు ఆర్మీ వర్గాలు చెప్తున్నాయి. వీరిలో పలువురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో ఐదు నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా ఈ ప్రమాదం జరిగింది.