భారత్ లో బయటపడ్డ ఒమిక్రాన్ కేసులు..ఏ రాష్ట్రంలో అంటే

corona-new-variant-omicron-presence-in-20-countries

ఒమిక్రాన్‌ వైరస్‌ భారత్ లో అడుగుపెట్టినట్లు కేంద్రం ప్రకటించింది. దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగు చూసిన ఈ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వేరియంట్ కేసులు ఇండియాలో సైతం బయటపడ్డాయి. 66, 46 ఏళ్ల వ్యక్తులకు ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని, ఈ రెండు కేసులను కర్ణాటకలోనే గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఒమిక్రాన్‌ భారత్‌లోకీ ప్రవేశించడంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలను అలర్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ మాస్కు తప్పనిసరి చేసిన ప్రభుత్వం .. నేటి నుంచి మాస్క్ పెట్టుకోకుంటే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రూ. వెయ్యి ఫైన్ విధిస్తారని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు.

దక్షిణాఫ్రికాలో ఈ నెలలోనే ఒమిక్రాన్ వేరియంట్‌ను కనుగొన్నారు. తర్వాత దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు సమాచారమిచ్చారు. నవంబర్ 24న ఈ కొత్త వేరియంట్‌ను ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్‌వో ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. గత వారం దీన్ని ఆందోళనకర రూపాంతరంగా పేర్కొంటూ ఒమిక్రాన్ అని పేరు పెట్టింది. ఈ వేరియంట్‌లో చాలా మ్యుటేషన్లు ఉన్నాయని, ప్రాథమిక లక్షణంగా రీఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు ఒక ప్రకటనలో డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఒమిక్రాన్‌తో రిస్క్‌ ఎక్కువే, తీవ్ర పరిణామాలు తప్పవని తాజాగా డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. తొలుత ఈ కొత్త వేరియంట్‌ను దక్షిణాఫ్రికా డాక్టర్ ఏంజెలిక్ కోట్జీ గుర్తించారు.