నేడు ధర్మపురి అసెంబ్లీ ఎన్నిక రీకౌంటింగ్

కోర్టు ఆదేశాలతో నేడు తెరుచుకోనున్న ఈవీఎం స్ట్రాంగ్ రూం తలుపులు

officials-to-open-evm-strong-room-in-dharmapuri-constituency

హైదరాబాద్ః గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో.. జిగిత్యాల జిల్లా ఈవీఎం స్ట్రాంగ్ రూం తెరవాలంటూ హైకోర్టు ఆదేశించింది. నేడు అధికారులు స్ట్రాంగ్ రూం తలుపులు తెరవనున్న నేపథ్యంలో స్థానికంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

2018 ఎన్నికల్లో అవకతవకల కారణంగా ఫలితాలు తారుమారయ్యాయని అడ్లూరి లక్ష్మణ కుమార్ రీకౌంటింగ్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేవలం 441 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయన ఎన్నికల్లో అవకతవలు జరిగినట్టు ఆరోపించారు. మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక హైకోర్టు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల సమక్షంలో నేడు ఉదయం 10.00 గంటలకు స్ట్రాంగ్ రూం తెరవనున్నారు. 268 ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూంలో 17సీ డాక్యుమెంట్లు కీలకం కానున్నాయి. వీఆర్కే కళాశాలలో ఈ స్ట్రాంగ్ రూం ఉంది.