పద్మశ్రీ అవార్డు గ్రహిత భాష్యం విజయసారథి ఇకలేరు

ప్రముఖ పండితుడు, రచయిత, కవి పద్మశ్రీ భాష్యం విజరు సారథి (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజరు సారథి కరీంనగర్‌ శ్రీపురం కాలనీలోని తన నివాసంలో మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

విజయసారథి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం దేశ సంస్కృత భాషా పాండిత్యానికి తీరని లోటని కేసీఆర్ పేర్కొన్నారు. శ్రీభాష్యం విజయసారథి సాహితీ సేవను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. కవిత్వ సృజనతో పాటు, రాగయుక్తంగా కవిత్వాలాపన చేయడంలో శ్రీభాష్యం గొప్ప ప్రతిభను ప్రదర్శించేవారని అన్నారు. వర్తమాన కవులకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని కేసీఆర్ అన్నారు.

సంస్కృతంలో అనేక కావ్యాలు రచించిన విజయసారథి అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. 2021లో అప్పటి రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. సంస్కృతంలో దక్షిణ భారత దేశం నుంచి ఈ అత్యున్నత అవార్డును అందుకున్న ఏకైక కవి విజయసారథి . ముఖ్యమంత్రి కేసీఆర్ పై రచించిన చంద్రశేఖర ప్రశస్తిః ఎంతో ప్రాచూర్యాన్ని పొందింది.