ఒడిశా రైలు ప్ర‌మాదం.. విచార‌ణ ప్రారంభించిన సీబీఐ

Odisha train accident: CBI formally takes over probe, team reaches at Balasore collision spot

బాలాసోర్‌: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న బ‌హ‌న‌గా బ‌జార్ స్టేష‌న్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘ‌ట‌న‌పై ఈరోజు సీబీఐ విచార‌ణ మొద‌లుపెట్టింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఉద‌యం సీబీఐ అధికారులు ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతానికి చేరుకున్నారు. యాక్సిడెంట్ సైట్‌కు చేరుకున్న సీబీఐ ఆఫీస‌ర్లు.. ఇంక్వైరీ మొద‌లుపెట్టిన‌ట్లు ఖుర్దా డీఆర్ఎం రింకేశ్ రాయ్ తెలిపారు. ప్ర‌మాదంపై ఖుర్దా డివిజిన‌ల్ రైల్వే మేనేజ‌ర్ మాట్లాడుతూ.. ఈ ప్ర‌మాదం వెనుక ఏదో కుట్ర ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. సిగ్న‌ల్‌ను ట్యాంప‌ర్ చేసి ఉంటార‌ని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. మెయిన్ లైన్‌లో గ్రీన్ సిగ్న‌ల్ ఉంద‌ని, అన్ని స‌క్ర‌మంగా ఉంటేనే గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తుంద‌ని, ఒక‌వేళ ఏదైనా స‌మస్య ఉంటే గ్రీన్ సిగ్న‌ల్ రాదు అని ఆయ‌న అన్నారు. త‌మ వ‌ద్ద ఉన్న డేటా లాగ‌ర్ ప్ర‌కారం గ్రీన్ సిగ్న‌ల్ బ‌ట‌న్ నొక్కిన‌ట్లే ఉంద‌ని తెలిపారు. అయితే ఎవ‌రైనా ఫిజిక‌ల్‌గా ట్యాంప‌ర్ చేస్తే త‌ప్ప ఆ సిగ్న‌ల్ మార‌ద‌న్నారు.

సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించ‌డంతో .. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఆందోళ‌న చెందుతున్న‌ట్లు బెంగాల్ బిజెపి నేత సువేందు అధికారి ఆరోపించారు. రైలు ప‌ట్టాలు త‌ప్పిన అంశంపై ఇద్ద‌రు రైల్వే అధికారులు జ‌రిపిన సంభాష‌ణ‌కు చెందిన ఆడియో రికార్డును తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌లు ఎలా లీక్ చేశార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రైల్వే ఆఫీస‌ర్ల ఆడియోను సోష‌ల్ మీడియాలో టీఎంసీ లీక్ చేసింద‌ని, ఇది ఎలా సాధ్యం అవుతుంద‌ని, కోల్‌క‌తాకు చెందిన పోలీసులే ఆ ఆడియోను రికార్డు చేసి ఉంటార‌ని ఆయ‌న ఆరోపించారు.