ఒడిశా ఆరోగ్య మంత్రిపై కాల్పులు..పరిస్థితి విషమం

ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబా దాస్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మంత్రి తీవ్రంగా గాయపడ్డారు. ఝర్పుగూడ జిల్లాలోని బ్రజరాజ్ నగర్ లోని గాంధీ చాక్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాంధీ చౌక్‌లో జరుగనున్న ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన వెళ్తున్నారు. వాహనం నుంచి బయటకు వచ్చేందుకు ఆయన కారును ఆపినప్పుడు కాల్పుల ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కాల్పుల ఘటనతో బీజేడీ కార్యకర్తులు ధర్నాకు దిగారు.

నాబా దాస్‌పై ఒక అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ కాల్పులు జరిపినట్టు ప్రాథమిక సమాచారం. రెండుసార్లు అతను కాల్పులు జరిపాడని, మంత్రి ఛాతీపై బుల్లెట్ గాయాలయ్యాయని తెలిసింది. ఏఎస్ఐ గోపాల్ దాస్ ఈ కాల్పులు జరిపినట్టు భ్రజ్‌రాజ్‌నగర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి గుప్తేశ్వర్ భోయ్ మీడియాకు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మంత్రిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, మంత్రి తన కారు నుంచి బయటకు వస్తుండగా ఏఎస్ఐ కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గాయపడిన మంత్రిని కారులో ఆసుపత్రికి తరలిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూసింది.