ప్రధాని భద్రతా వైఫల్యంపై స్పందించిన ఒడిశా సీఎం

ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కాదు..సీఎం నవీన్ పట్నాయక్‌

న్యూఢిల్లీ : పంజాబ్‌ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వైఫల్యం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనిపై కేంద్ర హోం శాఖ సీరియస్‌ కావడంతో పాటు తగిన వివరణ ఇవ్వాలని పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ఈ ఘటనకు కారణమెవరో తేల్చాలని అత్యున్నతస్థాయి విచారణ జరపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రంతో పాటు పంజాబ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. కాగా ప్రధాని మోడీ భద్రతా వైఫల్యంపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా ‘ భారత ప్రధానమంత్రి పదవి అనేది రాజ్యాంగ బద్ధమైనది. ఆయనకు పూర్తిస్థాయి భద్రతను అందించడం, రాజ్యాంగ గౌరవాన్ని కాపాడడం ప్రతి ప్రభుత్వ విధి. ఇలాంటి విరుద్ధమైన ప్రక్రియ ఏదీ కూడా మన ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదు..’ అని నవీన్‌ పట్నాయక్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కాగా , ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై ముగ్గురు సభ్యులతో హై లెవెల్‌ కమిటీని ఏర్పాటుచేసింది పంజాబ్‌ ప్రభుత్వం. మూడ్రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం ఛన్నీ. ఈ కమిటీలో జస్టిస్ (రిటైర్డ్) మెహతాబ్ సింగ్ గిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్ అఫైర్స్) & జస్టిస్ అనురాగ్ వర్మకు చోటు కల్పించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/