ఢిల్లీలో వాయు కాలుష్యం.. మరోసారి స‌రి-బేసి విధానం

Odd-even in Delhi from November 13-20, classes except 10, 12 shut until Friday

న్యూఢిల్లీ : దీపావ‌ళికి ముందే ఢిల్లీలో వాయు కాలుష్యం ప్ర‌మాద‌క‌ర స్ధాయికి చేర‌డంతో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. న‌వంబ‌ర్ 13 నుంచి 20 వ‌ర‌కూ వాహ‌నాల రాక‌పోక‌ల‌కు సంబంధించి మ‌ళ్లీ స‌రి-బేసి విధానం అమ‌లుకానుంది. ఈ విధానం ప్రకారం వాహన రిజిస్ట్రేషన్ నంబరు చివరన సరి సంఖ్య ఉన్న వాహనాలు ఒక రోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజున రోడ్డుపైకి రావాల్సి ఉంటుంది.

మ‌రోవైపు నిర్మాణ ప‌నుల‌కు బ్రేక్ ఇవ్వ‌డంతో పాటు 10, 12 త‌ర‌గ‌తులు మిన‌హా మిగిలిన త‌ర‌గ‌తుల‌ను న‌వంబ‌ర్ 10 వ‌ర‌కూ నిలిపివేశారు. ఇక సోమవారం ఉదయం 9 గంటలకు వాయు నాణ్యతా సూచి 437గా ఉందని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ప్రకటించింది.

అయితే గత మూడు రోజులతో పోల్చితే ఇది కాస్త తగ్గినా ఇంకా ప్ర‌మాద‌క‌ర స్ధాయిలోనే ఉంది. అంత‌కుముందు వాయు కాలుష్యంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌తోపాటు రవాణా శాఖ, ఢిల్లీ మున్సిపాలిటీ, పోలీస్‌, ఇతర శాఖలకు చెందిన సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.

కేంద్ర ప్రభుత్వం జారీచేసిన స్టేజ్‌-4 గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌ అమలుపై చర్చించిన అనంత‌రం స‌రి-బేసి విధానాన్ని తిరిగి అమ‌లు చేయాల‌ని, స్కూళ్ల‌ను ఈనెల 10 వ‌ర‌కూ మూసివేయాల‌ని నిర్ణ‌యించారు. వాయు కాలుష్య నియంత్ర‌ణ‌కు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై ఈ భేటీలో విస్తృతంగా చ‌ర్చించారు.