మోడీ హైదరాబాద్ టూర్.. ధర్నాలతో స్వాగతం పలకనున్న బీఆర్ఎస్

ప్రధాని మోడీ రేపు హైదరాబాద్ కు వస్తున్నారు. కేవలం రెండు గంటలు ప్రధాని పర్యటన సాగనుంది. తిరుపతి – సికింద్రాబాద్ వందేభారత్ ప్రారంభిస్తారు. అనంతరం సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. మూడు నెలల కాలంలోనే రెండో వందేభారత్ ను ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించనున్నారు. ప్రధాని కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రులు, గవర్నర్ తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం అందింది. కాగా గత కొద్దీ నెలలుగా బిఆర్ఎస్ vs బిజెపి వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా ప్రధాని మోడీ నిర్ణయాలను విభేదిస్తున్న సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. ప్రధాని పర్యటనల్లోనూ పాల్గొనటం లేదు.

ఇక రేపు ప్రధాని పాల్గొనే సభకు సీఎం కేసీఆర్ కు ప్రాటోకాల్ మేరకు ఆహ్వానం అందింది. ప్రధాని సభలో కేసీఆర్ ప్రసంగం కోసం ఏడు నిమిషాలు సమయం కేటాయించారు. మరి కేసీఆర్ మోడీ సమావేశంలో పాల్గొంటారా..లేదా అనేది చూడాలి; ఇదిలా ఉంటె మోడీ పర్యటన నేపథ్యంలో ఆయనకు ధర్నాలతో స్వాగతం పలకాలని బిఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. మోడీ టూర్ ను, బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసే పనిలోఉన్నారు. మరోవైపు మోడీ పర్యటనకు వస్తున్న రోజే బీఆర్ఎస్ ధర్నాలకు దిగనుంది. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ మహాధర్నా చేయాలని ఆ ప్రాంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, జిల్లా అధ్యక్షులను బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

ధర్నా విజయవంతం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నేతలను ఆదేశించారు. మే 30లోగా ఈ బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ పూర్తి చేయాలంటూ కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ ను వెంటనే వెనక్కి తీసుకొని, వేలంతో సంబంధం లేకుండా సింగరేణికే ఈ బ్లాకులు కేటాయించాలని డిమాండ్ చేశారు.