బాపట్ల లో ఎన్టీఆర్‌ విగ్రహానికి నిప్పు..

ఏపీలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. నిన్నటి నుండి అనేక జిల్లాల్లో టీడీపీ నేతలపై , కార్యకర్తలపై దాడులకు తెగపడుతున్నారు. తాడిపత్రి , పల్నాడు , చంద్రగిరి , మొదలగు ప్రాంతాలలో విద్వంస ఘటనలు జరుగగా..తాజాగా బాపట్లలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నిప్పు పెట్టారు. బాపట్ల జిల్లా పడమర పిన్నిబోయినవారిపాలెంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు.

సోమవారం పోలింగ్‌ సందర్భంగా టీడీపీ నేత, మాజీ సర్పంచి నర్రా ఏడుకొండలుపై వైసీపీ శ్రేణులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో గ్రామంలో నలుగురు పోలీసు సిబ్బందితో నామమాత్రంగా పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. వారు గ్రామం బయట ఉండటంతో ఇదే అదునుగా భావించి వైసీపీ నేత సుందర్‌సింగ్‌ తన అనుచరులతో కలిసి గ్రామ నడిబొడ్డులో ఉన్న టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ విగ్రహానికి మంగళవారం రాత్రి నిప్పు పెట్టారు. ఈ విషయం తెలిసి టీడీపీ కార్యకర్తలు, పోలీసులు వచ్చే సరికి వైసీపీ కార్యకర్తలు పరారయ్యారు. దాడులు చేయిస్తున్నది ఎవరో పోలీసులకు తెలిసినా అధికార పార్టీ నేతలను అదుపులోకి తీసుకుని గట్టిగా కౌన్సిలింగ్‌ ఇవ్వటంలో బాపట్ల గ్రామీణ పోలీసు అధికారులు విఫలమయ్యారని ఆరోపణల వెల్లువెత్తుతున్నాయి.