ఎవరు ఎవరిని మోసం చేశారో కొడాలి నాని తన ఆత్మసాక్షిని అడగాలిఃనందమూరి రామకృష్ణ

అభివృద్ధిలో రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శ

ntr-son-ramakrishna-fires-on-kodali-nani

అమరావతిః ఎన్టీ రామారావు స్వగ్రామమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో నిర్వహించిన శతజయంతి వేడుకులకు హాజరైన ఆయన తనయుడు రామకృష్ణ.. మాజీ మంత్రి కొడాలి నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి వంశమన్న విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చంద్రబాబు పదేపదే మోసం చేస్తున్నారన్న కొడాలి నాని వ్యాఖ్యలపై స్పందించిన రామకృష్ణ.. ఎవరు ఎవరిని మోసం చేశారో ఆయన తన ఆత్మసాక్షిని అడిగితే తెలుస్తుందన్నారు. టిడిపిని వాడుకున్న కొడాలి నాని నందమూరి కుటుంబాన్ని మోసం చేశారని అన్నారు.

అలాగే, ఏపీ పరిస్థితులపై మాట్లాడుతూ.. అభివృద్ధిలో రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. అడుక్కోవడానికి కూడా చిప్ప దొరకని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి పునర్వైభవం తీసుకురావడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమన్నారు. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని మాట్లాడుతూ.. నిమ్మకూరు రావడం ఆనందంగా ఉందన్నారు. ఆడపడుచు వచ్చిందని అందరూ గౌరవిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు రామకృష్ణ, టిడిపి నేతలు నివాళులు అర్పించారు.