23 మంది అభ్యర్థులతో కర్ణాటక బిజెపి రెండో జాబితా విడుదల

Karnataka BJP second list with 23 candidates released

Community-verified icon


బెంగళూరుః కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గరపడుతున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. అధికార పార్టీ బిజెపిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసంతృప్తి నేతలు ఒక్కక్కరుగా బయటకు వస్తున్నారు. టిక్కెట్లు దక్కని వారు నిరసన తెలియజేస్తున్నారు. పార్టీపై విమర్శలు చేస్తూ..ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. బుధవారం (ఏప్రిల్ 12న) విడుదలైన అభ్యర్థుల తొలి జాబితాపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్‌ లభిస్తుందని ఆశపడ్డ వారికి భంగపాటు ఎదురవ్వడంతో రాత్రికి రాత్రి పార్టీకి రాజీనామా చేయడం, రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం వంటివి చేస్తున్నారు.

23 మంది అభ్యర్థులతో బిజెపి తన రెండో జాబితాను గురువారం (ఏప్రిల్ 13వ తేదీన) విడుదల చేసింది. కొత్తగా ప్రకటించిన జాబితాలో ఏడుగురికి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ దక్కలేదు. 23 మందిలో ఇద్దరు మహిళలకు టిక్కెట్లు ఇచ్చారు. ఇప్పటికే 189 అభ్యర్థులతో బుధవారం మొదటి జాబితాను విడుదల చేయగా ప్రస్తుతం 23 మందిని ప్రకటించింది. ఇంకా 12 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. దీంతో మూడో జాబితా కూడా విడుదల చేయనున్నారు. రెండో జాబితాలో చాలామంది సీనియర్ నేతలకు టికెట్లు రాకపోవడంతో వారంతా పార్టీపై గుర్రుగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగదీష్‌ పెట్టర్‌ పేరు మొదటి, రెండవ జాబితాలోనూ లేదు. హుబ్బలి నుంచి ఆరుస​ఆర్లు గెలిచిన జగదీష్‌..ఈసారి కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆయనకు ఈ సారి టిక్కెట్ ఇవ్వలేదు. మూడో జాబితాలోనైనా తనకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు షెట్టర్‌. ఒవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.

వరుణలో కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై పోటీ చేస్తున్న వి సోమన్న.. గుబ్బి స్థానం తన కుమారుడికి ఇవ్వాలని కోరారు. అయితే బిజెపి అందుకు అంగీకరించలేదు. గుబ్బి నియోజకవర్గం నుంచి ఎస్‌డి దిలీప్‌కుమార్‌ను పార్టీ బరిలోకి దింపింది. బైందూరు ఎమ్మెల్యే సుకుమార్ శెట్టికి ఈసారి నిరాశే ఎదురైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కాదని గురురాజ్ గంటిహోళీకి అవకాశం ఇచ్చింది. అవినీతి ఆరోపణలపై అరెస్టైన బిజెపి ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్పను పార్టీ పక్కకు పెట్టింది. చన్నగిరి నుంచి ఆయనను తప్పిస్తూ.. శివకుమార్‌కు సీటు ఇచ్చింది.దావణగెరె నార్త్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్, హావేరి ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్‌కు పార్టీ టిక్కెట్లు దక్కలేదు. వీరి స్థానాల్లో లోకికెరె నాగరాజ్, గవిసిద్దప్ప ద్యామన్నవర్‌లను ఎంపిక చేశారు.

కాగా, 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరుగుతాయి. మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. నామినేషన్ల దాఖలు నేటి నుంచి (ఏప్రిల్ 13) ప్రారంభమై ఏప్రిల్ 20 వరకు కొనసాగనున్నాయి.