మరింత ఆలస్యంగా వస్తున్న తారక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా, మరో స్టార్ హీరో రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఇండియన్ సినిమా రికార్డులకు తారక్, చరణ్‌లు ఎసరు పెట్టడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాగా తారక్ త్వరలో ఓ టీవీ గేమ్ షోను హోస్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

జెమిని టీవీలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే షోను తారక్ హోస్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ షోను ఇటీవల అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే ఈ షోను మే 17న ప్రారంభించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేశారు. తారక్ పుట్టినరోజు(మే 20)ను పురస్కరించుకుని ఈ షోను ప్రారంభించాలని వారు భావించారు. కానీ ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ భీభత్సం సృష్టిస్తుండటంతో ఈ షోలో పాల్గొనేందుకు కంటెస్టెంట్స్ ఆసక్తిగా చూపడం లేదట.

దీంతో వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న షో నిర్వాహకులు, ఈ గేమ్ షోను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈ కారణంగా తారక్ హోస్ట్ చేయబోయే ఈ షో ఏకంగా జూన్ లేదా జూలైలో ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. మరి తారక్ ఎవరు మీలో కోటీశ్వరులు షోతో ఎప్పుడు మనముందుకు వస్తాడో చూడాలి.