కైత్లాపూర్‌ మైదానంలో నేడు ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, సినీ దిగ్గజం దివంగత నందమూరి తారక రామారావు(NTR) శత జయంతి వేడుకలకు కూకట్‌పల్లి కైత్లాపూర్ మైదానం సిద్ధమైంది. ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకొని ‘ఎన్టీఆర్‌ లిటరేచర్‌, సావనీర్‌ అండ్‌ వెబ్‌సైట్‌ కమిటీ’ ఈరోజు సాయంత్రం 5గంటలకు హైదరాబాద్‌, కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులోని కైతలాపూర్‌ మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వేడులకలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. అలాగే ప్రముఖ సినీ నటడు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్నారు. దాదాపు 15000 నుంచి 20000 మంది సభ్యులు ఈ వేడుకలకు హాజరవుతారని సమాచారం.

ఈ వేడుకలలో భాగంగా ఎన్టీఆర్‌ సమగ్ర సినీ, రాజకీయ జీవితంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన సహచర నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు, పాత్రికేయులు, సహచర రాజకీయ నాయకులు, వివిధ పార్టీల నేతలు, ఎడిటర్లు వెలిబుచ్చిన అభిప్రాయాలు, ప్రత్యేకంగా రాసిన వ్యాసాలను సంకలనం చేసిన ‘శక పురుషుడు’ ప్రత్యేక సావనీర్‌ను, అదేవిధంగా ఎన్టీఆర్‌ సమగ్ర జీవితానికి సంబంధించిన విశేషాలు, సినీ పాటలు, సినిమాలు, ఉపన్యాసాలు తదితర పూర్తి సమాచారంతో రూపొందించిన ‘జై ఎన్టీఆర్‌’ వెబ్‌సైట్‌ ఆవిష్కరించనున్నారు.

ఇక ఈ వేడుకల సందర్బంగా కొన్ని మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు ప్రయాణికులు ప్రత్యామ్నాయ రహదారులను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.

ట్రాఫిక్ మళ్లింపులు ఇలా:

మూసాపేట్ నుంచి కెపిహెచ్‌బి-IV ఫేజ్, హైటెక్ సిటీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మూసాపేట్ ఎక్స్-రోడ్-కూకప్తల్లి బస్టాప్-జెఎన్‌టియు జంక్షన్‌కు మళ్లిస్తారు.

IDL లేక్ నుంచి మాదాపూర్, హఫీజ్‌పేట్ వైపు వచ్చే ట్రాఫిక్ IDL జంక్షన్ – కూకట్‌పల్లి బస్ స్టాప్ – KPHB రోడ్.నం:01 – JNTU జంక్షన్‌కు మళ్లించబడుతుంది.

హైటెక్ సిటీ నుంచి కూకట్‌పల్లి, మూసాపేట్ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్‌ను KPHB-IV ఫేజ్ – లోధా అపార్ట్‌మెంట్స్ – KPHB రోడ్‌ నం.01 మీదుగా మళ్లిస్తారు.

పర్వత్ నగర్, మాదాపూర్ నుంచి కూకట్‌పల్లి వైపు వచ్చే ట్రాఫిక్, మూసాపేట్ రహదారి SBI సిగ్నల్ – NIA – ఎడమ మలుపు – 100 అడుగుల సిగ్నల్ U-టర్న్‌కు మళ్లిస్తారు.

ఈ క్రమంలో ప్రయాణీకులందరూ పై సలహాను పాటించవలసిందిగా, ట్రాఫిక్ సజావుగా ఉండేలా సహకరించవలసిందిగా ట్రాఫిక్ పోలీసులు కోరారు.