నేనేమీ క్రిమినల్ కాదు..రాజీనామా చేయను: బ్రిజ్ భూషణ్

న్యూఢిల్లీః భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై భారత మహిళా రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. తానేమీ తన పదవికి రాజీనామా చేయడం లేదన్నారు. రాజీనామా పెద్ద విషయం కాదు అని, కానీ తానేమీ క్రిమినల్‌ను కాదన్నారు. ఒకవేళ తాను రిజైన్ చేస్తే, అప్పుడు రెజ్లర్ల ఆరోపణలు అంగీకరించినట్లు అవుతుందని బ్రిజ్ పేర్కొన్నారు. తన పదవీ కాలం దగ్గరపడిందని, ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిందని, 45 రోజుల్లో ఎన్నికలు వస్తాయని, ఆ ఎన్నికల తర్వాత తన టర్మ్ ముగుస్తుందని బ్రిజ్ తెలిపారు. ప్రతి రోజు రెజ్లర్లు కొత్త డిమాండ్ చేస్తున్నారని, ముందుగా ఎఫ్ఐఆర్ డిమాండ్ చేశారని, ఎఫ్ఐఆర్ నమోదు చేశాక, ఇప్పుడు తనను జైలుకు పంపాలంటున్నారని, అన్ని పోస్టులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. తన నియోజకవర్గ ప్రజల వల్ల తాను ఎంపీని అయ్యానని, వినోశ్ పోగట్ వల్ల తానేమీ ఎంపీని కాలేదన్నారు. ఒక అకాడమీకి చెందిన ఒక కుటుంబం నిరసనలు చేపడుతోందని, హర్యానాకు చెందిన 90 శాతం మంది అథ్లెట్లు తనతోనే ఉన్నారని డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ తెలిపారు.
గడిచిన 12 ఏళ్ల నుంచి రెజ్లర్లు ఏ పోలీసు స్టేషన్‌లో కూడా తనపై ఫిర్యాదు చేయలేదని, క్రీడా మంత్రిత్వశాఖకు కానీ, సమాఖ్యకు కానీ తనపై ఫిర్యాదులు చేయలేదన్నారు. నిరసన చేపట్టడానికి ముందు ఆ రెజ్లర్లు తనను ప్రశంసించేవారని, పెండ్లిలకు కూడా పిలిచేవారని, తనతో ఫోటోలు కూడా దిగేవారని, తన ఆశీర్వాదాలు తీసుకునేవారని చెప్పారు. అయితే ఇప్పుడు తన మ్యాటర్ సుప్రీంకోర్టు, ఢిల్లీ పోలీసుల చేతుల్లో ఉందని, వారి నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని బ్రిజ్ అన్నారు.తాను అమాయకుడిని అని, ఎటువంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు బ్రిజ్ వెల్లడించారు. విచారణాధికారులకు సహకరించనున్నట్లు చెప్పారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.