వైసీపీలో నెల‌కొన్న‌ అసంతృప్తి పై అంబటి రాంబాబు స్పందన

ఏపీలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 25 మందితో కూడిన కొత్త మంత్రివర్గం ఏర్పాటు అయ్యింది. వీరిలో 11 మంది పాతవారే కాగా14 మంది కొత్తవారికి మంత్రివర్గంలో చోటు దక్కింది. కాగా మంత్రివర్గం ఏర్పాటు ఫై కొంతమంది వైసీపీ నేతల్లో ఆగ్రహపు జ్వాలాలు మొదలయ్యాయి. తమకు మంత్రి అయ్యే ఛాన్స్ వస్తుందని ఆశపడ్డ వారికీ నిరాశే ఎదురవ్వడం తో పార్టీ అధిష్టానం ఫై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాజీ హొం మంత్రి సుచ‌రిత ఏకంగా ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయగా, అలాగే కొన్ని చోట్ల త‌మ అభిమాన నాయ‌కుల కోసం కొంత మంది రాజీనామాలు చేశారు. కొత్త‌ కేబినెట్ వ‌ల్ల వైసీపీలో నెల‌కొన్న‌ అసంతృప్తి పై భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

మంత్రియ్యాక మొద‌టి సారి క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించారు రాంబాబు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. వైసీపీలో వ‌చ్చిన అసంతృప్తి టీ క‌ప్పులో తుపాన్ అని అభివ‌ర్ణించారు. మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో అసంతృప్తి ఉంటుంద‌ని అన్నారు. కానీ అసంతృప్తితో త‌ప్పు చేస్తే.. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. జ‌గ‌న్ మ‌రో ఐదేళ్లు సీఎం గా ఉంటార‌ని అన్నారు. ఇప్పుడు మంత్రి ప‌ద‌వి రాని వారికి భ‌విష్య‌త్తులో అవ‌కాశం ఇస్తార‌ని తెలిపారు.

ఆంధ్రరాష్ట్రానికి పోలవరం మణిహారమని, నిర్మాణదశలో ఉన్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తానని రాంబాబు అన్నారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పోల వరం ప్రాజెక్టు శంకుస్థాపన చేశారని, ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మెహన్‌రెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తారన్నారు. జలవనరుల శాఖ కీలకమైనదని రాష్ట్రానికి, ప్రభుత్వానికి, ప్రజలకు, నియోజకవర్గానికి మంచిపేరు తీసుకొచ్చేలా పారదర్శకంగా పనిచేస్తానన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంస్కరణలతో, వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతో పరిపాలనను ప్రజల చెంతకు తీసుకొచ్చారన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా కోట్లరూపాయలు లబ్ధిదారుల ఖాతాలో చేర్చుతున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు.