రెండు బాలిస్టిక్ మిస్సైళ్ల‌ను ప‌రీక్షించిన ఉత్త‌ర కొరియా !

ప్యోంగ్యాంగ్‌: రెండు బాలిస్టిక్ మిస్సైళ్ల‌ను ఉత్త‌ర కొరియా నేడు ప‌రీక్షించింది. తూర్పు స‌ముద్రంలో ఆ క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించారు. ద‌క్షిణ కొరియాకు చెందిన జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఈ విష‌యాన్ని ద్రువీక‌రించారు. గుర్తు తెలియ‌ని ప్రొజెక్టైల్‌ను కూడా ఉత్త‌ర కొరియా ప‌రీక్షించిన‌ట్లు జేసీఎస్ తెలిపింది. జ‌పాన్ కోస్ట్ గార్డ్‌ల‌కు స‌ముద్రంలో ఓ వ‌స్తువును గుర్తించారు. అయితే అది బాలిస్టిక్ మిస్సైల్‌కు చెంది ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఐక్య‌రాజ్య‌స‌మితి విధించిన ఆంక్ష‌ల‌ను ఉత్త‌ర కొరియా ఉల్లంఘించిన‌ట్లు నిపుణులు చెబుతున్నారు.

న్యూక్లియ‌ర్ కార్య‌క‌లాపాల‌ను అడ్డుకునేందుకు బాలిస్టిక్ మిస్సైళ్ల ప‌రీక్ష‌ల‌ను యూఎన్ నిషేధించింది. అయితే ఇవాళ జ‌రిగిన ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ద‌క్షిణ కొరియా, జ‌పాన్ దేశాలు ఇంకా స్పందించ‌లేదు. రెండు రోజుల క్రిత‌మే నార్త్ కొరియా ఓ లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్‌ను ప‌రీక్షించిన విష‌యం తెలిసిందే. ఆ క్రూయిజ్ మిస్సైల్‌.. అణ్వాయుధాల‌ను మోసుకువెళ్ల‌గ‌ల‌దు. క్రూయిజ్ మిస్సైళ్ల‌ను యూఎన్ పెద్ద‌గా ప‌ట్టించుకోదు. బాలిస్టిక్ మిస్సైళ్ల‌ను మాత్ర‌మే ప్ర‌మాద‌క‌రంగా భావిస్తారు. ఆ క్షిప‌ణులు అతిపెద్ద సైజులో ఉండే శ‌క్తివంత‌మైన పేలోడ్ల‌ను మోసుకువెళ్ల‌గ‌ల‌వు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/