‘అలీబాబా’కు రూ.8.5 లక్షల కోట్లు నష్టం

వరుస షాక్‌లు!

Alibaba loses Rs 8.5 lakh crore
Alibaba loses Rs 8.5 lakh crore

బీజింగ్‌: చైనా కుబేరుడు జాక్‌ మా నేతృత్వంలోని అలీబాబాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. జాక్‌ మాతో పాటు అతని ఫైనాన్షియల్‌ సామ్రాజ్యంపై గత కొద్ది రోజులుగా చైైనీస్‌ అధికారులు కన్నెర్ర చేస్తున్నారు. గుత్తాధిపత్య నిబంధనల కింద దర్యాప్తుకు కూడా ఆదేశించాయి.

ఇటీవల యాంట్‌ గ్రూప్‌, అనుబంధ సంస్థలపై దర్యాప్తు చేస్తున్నాయి. వివిధ కారణాలు చూపించి యాంట్‌ గ్రూప్‌ అతిపెద్ద ఐపిఒకు చెక్‌ చెప్పారు. అంతేకాకుండా, చైనా బ్యాంకులపై జాక్‌ మా చేసిన వ్యాఖ్యలు కూడా అలీబాబాపై ప్రభావం చూపాయి. యాంట్‌ ఫైనాన్షియల్‌ ఐపిఒ అంశం అలీబాబా సంపదను కరిగిస్తోంది.

వివిధ కారణాలు చూపిస్తూ యాంట్‌ ఫైనాన్షియల్‌ 10 బిలియన్‌ డాలర్ల ఐపిఒను చైనా అధికారులు ఆపేశారు. దీంతో ఈ కంపెనీ విలువ ఈ కాలంలో భారీగా నష్టపోయింది. వరుసగా రెండు ట్రేడింగ్‌ సెషన్లలో అలీబాబా సంపద 116 బిలియన్‌ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. మన కరెన్సీలో దాదాపు 8.5లక్షల కోట్లు.

అలీబాబా అనుబంధ సంస్థపై యాంటీట్రస్ట్‌ దర్యాప్తు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. దీంతో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్ఛేంజీలో అలీబాబా షేరు దాదాపు పదిహేను శాతం పడిపోయింది. ఈ దర్యాప్తు తర్వాత జరిమానా విధిస్తారనే భయంతో ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించేందుకు మొగ్గుచూపుతున్నారు.
ఈ దర్యాప్తు దెబ్బ అలీబాబాపై తీవ్రంగా పడింది.

కంపెనీ 10 బిలియన్‌ డాలర్లతో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలును ప్రతిపాదించింది. మొదట 6 బిలియన్‌ డాలర్ల బైబ్యాక్‌ను తర్వాత 10 బిలియన్‌ డాలర్లకు పెంచేందుకు అలీబాబా బోర్డు నిర్ణయించింది. 2022 వరకు బైబ్యాక్‌ చేపట్టనుంది.

అయితే నియం త్రణ సంస్థలు, అలీబాబా ఆధిపత్య ధోరణిపై దర్యాప్తు చేపట్టేందుకు మొగ్గు చూపడంతో కౌంటర్లో అమ్మకాలు కొనసాగాయి. గతంలో బ్యాంకులపై జాక్‌ మా వ్యాఖ్యలు దూమారం రేపాయి. అప్పుడు కూడా షేర్లు పడిపోయాయి.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/