బిట్‌కాయిన్‌ను క‌రెన్సీగా గుర్తించ‌డంలేదు: ఆర్థికమంత్రి

బిట్ కాయిన్ పై ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ : ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ క్రిప్టోకరెన్సీల అంశంపై సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిట్ కాయిన్ పై కేంద్రం వైఖరిని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో స్పష్టం చేశారు. బిట్ కాయిన్ ను కరెన్సీగా గుర్తించే యోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని వెల్లడించారు. బిట్ కాయిన్ ను కరెన్సీగా పరిగణించే ప్రతిపాదనలేవీ కేంద్రం చేయలేదని నిర్మలా వివరించారు. బిట్ కాయిన్ లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించామన్న ప్రచారంలో నిజంలేదని తెలిపారు.

లోక్ సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆమె ఈ వివరణ ఇచ్చారు. ఆర్బీఐ ద్వారా సొంత డిజిటల్ కరెన్సీ రూపొందించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, దేశంలో బిట్ కాయిన్ తరహా ఇతర క్రిప్టోకరెన్సీలను అనుమతించేది లేదని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో స్పష్టమైంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/