సీపీఎస్ రద్దుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీ సర్కార్ సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన ఉద్యమానికి ప్రభుత్వంలో చలనం వచ్చింది. సీపీఎస్ రద్దుపై కొత్త కమిటీ వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ఐదుగురు సభ్యలతో కమిటీ వేసింది. సీఎస్‌తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డిలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మరోవైపు సీపీఎస్ పై చర్చించేందుకు సచివాలయంలో సోమవారం జాయింట్ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీ అయింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ నేతృత్వంలో చర్చలు జరిగాయి. సమావేశంలో ఆర్థికమంత్రి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, ఉన్నతాధికారులు, రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. సీపీఎస్ రద్దు సాధ్యాసాధ్యాలు, ఇతర అంశాలపై చర్చించిన అనంతరం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి తుదినివేదికను సీఎంకు అందజేస్తుంది.