రైతు బతుకుతో రాజకీయాలొద్దు!

‘ఒక్కమాట’ ప్రతి శనివారం

Farmers

పొరుగున ఉన్న చైనా, తైవాన్‌, జపాన్‌, కొరియా వంటి దేశాలు వ్యవసాయరంగంలో నూతన పరిశోధనలద్వారా పంటల దిగుబడి పెంచడమేకాక వ్యవసాయాన్ని లాభసాటిగా వ్యాపకంగా మార్చుకుంటే మనంమాత్రం వ్యవసాయ పరిశోధనాలయాలను పాడుపెట్టి మూడు దశాబ్దాల నాటి కాలంచెల్లిన వంగడాలతో పొద్దుపుచ్చుతున్నాం.

కొత్త వంగడాలు లేవ్ఞ. నీటి యాజమాన్య పద్ధతుల ఆధునీకరణ లేదు. ఎరువ్ఞలు, పురుగు మందులు వాడకంలో మెలకువలు కనిపెట్టడం లేదు.

మార్కెటింగ్‌ వ్యవస్థ ఆధునీకరణ లేదు. అవసరం మేరకు గోడౌన్‌లు లేవు. శీతల గిడ్డంగులు లేవ్ఞ. ఏ సమయంలో ఏ పంటకు గిట్టుబాటు ధర వస్తుందో ముందుగాచెప్పే యంత్రాంగం లేదు.

నిజంగా రైతులమీద చిత్తశుద్ధి ఉంటే రాజకీయ ప్రయోజనాలకోసం తాత్కాలిక పథకాలు సరే, వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించే శాశ్వత పథకాలకు రూపకల్పన చేయాలి. ఇందులో రాజకీయాలు చేయడం ఏమాత్రం ధర్మంకాదు.

బాధపడటమేతప్ప బాధించడం తెలియని రైతన్నలు ఇటీవల కాలంలో సహనం, ఓర్పు సన్నగిల్లి ఆందోళనల బాటపడు తున్నారు.

తమకు ఎంతటి నష్టం జరిగినా, ఎవరు ఎంతగా మోసగించినా తమలో తాము కుళ్లికుళ్లి, మనసులో బాధపడి చివరకు ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధపడతారేతప్ప తమను దగాచేసిన వారిపై కక్షకట్టి దాడులు చేసేందుకు సహసించక పోయేవారు.

పంటలకు గిట్టుబాటు ధర రాకపోతేపోనీకానీ కనీసం పంటను మార్కెట్‌కు తీసుకువచ్చిన ఖర్చులు కూడా రాకపోయినా రోడ్లపై పారబోసి తమ కర్మకు తాము బాధపడుతూ మౌనరో దనతో ఇంటిముఖం పట్టేవారు.. కానీ గత దశాబ్దంగా కొందరు రైతులు తమ నిరసనలను తెలిపేందుకు స్వచ్ఛందంగానే ముందు కువస్తున్నారు.

ఇటీవల కాలంలో రోడ్లపైకి రావడం, ధర్నాలులాం టివి చేస్తున్నారు. కానీ అవి ఎక్కడికక్కడ తాత్కాలికంగా జరుగు తున్నాయేతప్ప సంఘటితంగా నిర్వహించిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పొచ్చు.

మొన్నామధ్య దేశ రాజధాని ఢిల్లీని చుట్టు ముట్టిన ఒకటి, రెండు సంఘటనలుతప్ప వేరే లేవ్ఞ. ఆరుగాలం అష్టకష్టాలూ పడి పండించి తెచ్చిన పంటలను అమ్ముకోవడంలో వారు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావ్ఞ. దేశవ్యాప్తంగా అధిక శాతం మార్కెట్లలో దళారులదే రాజ్యం.

కొలతల్లో మోసం, ధరలను నిర్ణయించడంలో దగా. ఒకటేమిటి ఎక్కడవీలైతే అక్కడ చేతివాటం ప్రదర్శించేందుకు దళారులు నిత్యం పొంచివ్ఞంటూనే ఉన్నారు.రైతులు మోసపోతూనే ఉన్నారు. మోసపోయేవారు ఉన్నంతకాలం మోసం చేసేవారు ఉంటారన్నట్టే,

ఈ దళారీ వ్యవస్థ ఉన్నంత కాలం రైతులకు ఈ బాధలు తప్పవ్ఞ. ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులు పండించిన పంటలన్నీ ప్రభుత్వమే రైతుల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు.

దేశ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అనే విషయంలో సందేహం లేదు. వరి ధాన్యమే కాకుండా మొక్కజొన్నలు, కందులు, శనగలు, తదితర పంటలన్నీంటినీ ప్రభుత్వం నిర్ణయిం చిన ధరలకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు.

కొనుగోళ్లు తెలంగాణవ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి. అయితే కొందరు మిల్లర్లు కూడా ప్రభు త్వం పిలుపు మేరకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేస్తున్నారు.

కానీ కొన్ని ప్రాంతాల్లో నాణ్యత పేరుతో ధరలు తగ్గించడం, కొలతల్లో దగాచేయడం అన్నింటికంటే మించి తాలు పేరుతో లారీకి రెండుమూడు క్వింటాళ్లు కోత విధి స్తున్నారని, దాన్ని కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తమపై వేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

ఇది ఎవరికి చెప్పినా పట్టించుకోకపో వడంతో గురువారం రాజన్నసిరిసిల్ల జిల్లా తంగెల్లిపల్లి మండలం లో ఐకెపి కొనుగోలు కేంద్రంలోనే ధాన్యానికి నిప్పుపెట్టి రైతులు ఆందోళన చేపట్టారు.

సంబంధిత అధికారులు సంఘటనా స్థలా నికి చేరుకుని కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా, అవకతవకలకు అవకాశం లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

ఇక ధాన్యంలో తేమశాతం అధికంగా ఉందని, తాలు ఉం దని, రైతులను దోచుకునేందుకు మిల్లర్లు ప్రయత్నిస్తే కఠిన చర్య లు తీసుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ గురు వారం హైదరాబాద్‌లో హెచ్చరించారు.

కరీంనగర్‌ జిల్లాలో ఇలాం టి సమస్య ఉత్పన్నమవ్ఞతున్నట్లు తమకు సమాచారం అందిందని కూడా ఆయన చెప్పారు.

ఇక ఇది ఇలావ్ఞండగా రైతులు పండిం చిన ప్రతి గింజను కొంటామని ముఖ్యమంత్రి చెప్పిన మాటలు వాస్తవరూపం దాల్చడం లేదని కరీంనగర్‌ పార్లమెంటు సభ్యుడు, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ§్‌ుకుమార్‌ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శికి గురువారం బహిరంగ లేఖ రాశారు.

రైతుల సమస్యలకు సంఘీభావంగా శుక్రవారం ఉదయం పది గంటలనుండి సాయంత్రం ఐదు గంటలవరకు దీక్ష చేశారు. రైతు ల సమస్యలు ఒక్క తెలంగాణాలోనే కాదు దేశవ్యాప్తంగా ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి.

అక్కడ కానీ, ఇక్కడకానీ రైతు సమస్యలు ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవి కావ్ఞ. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి కొనసాగుతున్నవే.

ఎన్ని సమస్య లున్నా, ఎంతటి సంక్షో భం ఉన్నా భారతదేశంలో ఇప్పటికీ వ్యవసాయ ఆధారంగా బతికే వారే అధిక సంఖ్యలో ఉన్నారు. ఇంత పెద్ద జనాభాకు కావలసిన పంటలు వారిచెమట పుణ్యమేననేది అందరం గుర్తుంచుకోవాలి.

రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఎవరు ఏంచెప్పినా గత ఏడు దశాబ్దాలకాలంలో భారతదేశంలో వ్యవ సాయ విప్లవం వచ్చిన మాటవాస్తవమే. (భూసంస్కరణలు) భూముల పంపకం, నియం త్రణ, లక్ష్యానికి దూరంగానైనా కొంత జరిగిందని చెప్పొచ్చు.

వ్యవసాయరంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో దిగుబడి విశేషంగా పెరిగింది. ఎన్నో ప్రాజెక్టులువచ్చాయి. ఇంకా వస్తున్నాయి. లక్ష లాది ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చాయి. జాతీయ సంపద లో వ్యవసాయం వాటా గణనీయంగా పెరిగింది.

ఇది ఆర్థికరంగ నిపుణులే అంగీకరిస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ యేడాదికేడాదికి రైతన్నలు కృంగిపోతున్నారు.

అందుకే వీటన్నిం టికీ మూలమైన రైతు జీవన ప్రమాణం ఎలా ఉంది? లోపాలు ఎక్కడున్నాయి? ఎలా వాటిని అధిగమించాలి? అని పరిశీలించా ల్సిన సమయమిది. అప్పులేని రైతులేడు.

బహుశా దేశంలో ఆత్మ హత్యల్లో రైతన్నలే అగ్రస్థానంలో ఉన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు వందలు, వేలు కాదు లక్షల సంఖ్యలో బలిదానం చేస్తున్నారు.

విత్తనం దగ్గర నుండి విక్రయించేవరకూ అన్నీ కష్టాలే. అన్ని స్థాయిల్లో దోపిడీకి గురవ్ఞతున్నారు.

ఒకరకంగా చెప్పాలంటే రైతులు నిలదొక్కుకోవడానికి కావలసింది రాయితీలు, దయాదాక్షి ణ్యాలు కాదు.సరైన సాంకేతిక సలహా, వ్యవస్థాపరమైన సహాయ సహకారాలు కావలసినంత వారికి సమకూరడం లేదు. కర్షకులను మోసాలకు గురిచేయకుండా చేయాల్సిన చట్టాలు వారిని రక్షించ లేకపోతున్నాయి.

వ్యవసాయానికి మూలమైన విత్తనాన్నే తీసుకుం దాం. విత్తనం నకిలీదైతే పంట చివర్లో తెలిసేసరికి అప్పటికే పెట్టుబడి, శ్రమ అంతా పెట్టడంతో రైతు కుప్పకూలిపోతున్నా డు.

నకిలీ విత్తనాలపై కఠినచర్యలు తీసుకుంటామని పాలకులు చెపుతున్న మాటలు రెండు,మూడు దశాబ్దాలు అయినా అమలుకు నోచుకోలేకపోతున్నాయి.

ఒర్లిఒర్లి వారుపోతారు, వండక తిని మనం పోదామన్నట్లుగా ఈ నకిలీ, నాసిరకం విత్తనాల దళారులు వ్యవహరిస్తున్నారు.

కర్షకుల సంక్షేమం పేరుతో చేసిన చట్టాలు వాస్తవానికి దళారులకు మేలు చేసేవిగా ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలకన్నా తోటి మనుషులు చేస్తున్న చట్టాలే కర్షకులకు గుదిబండగా మారిపోయాయి. క్రిమిసంహారక మందులు, పారిశ్రామిక వ్యాపారం కావచ్చు. లాభాలు తెచ్చిపెట్టే వ్యాపారం కూడా కావచ్చు.

కానీ మనుషులకు పురుగుమందులవల్ల ప్రాణాం తకమైన, ఆరోగ్యపరమైన ప్రమాదాలు రాకుండాచూడాల్సిన గురుతరబాధ్యత పాలకులదే.

దేశంలో అధిక శాతం చిన్న సన్న కారు రైతులే. నష్టపోయింది, నష్టపోతున్నది వారే. భూసారం మీద, అప్పులు చెల్లింపులు, కల్తీ లేని ఎరువ్ఞలు, విత్తనాలు, నీటి వసతి, పంటలకు తగిన ధర వంటి అనేక అంశాలపై రైతుల ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది.

ఇందులో ఏ ఒక్కటి లోపం జరిగినా రైతు దెబ్బతింటాడు. వ్యవసాయాన్ని లాభసాటిగా రెట్టిం పు ఆదాయం వచ్చేవిధంగా రూపకల్పన చేస్తా మని చెపుతున్న మాటలు ఆచరణకు ఆమడదూరంలో కూడా కల్పించడం లేదు.

కొత్త వంగడాలు లేవ్ఞ. నీటి యాజమాన్య పద్ధతుల ఆధునీకరణ లేదు. ఎరువ్ఞలు, పురుగు మందులు వాడకంలో మెలకువలు కనిపెట్టడం లేదు. మార్కెటింగ్‌ వ్యవస్థ ఆధునీకరణ లేదు.

అవసరం మేరకు గోడౌన్‌లు లేవ్ఞ. శీతల గిడ్డంగులు లేవ్ఞ. ఏ సమయంలో ఏ పంటకు గిట్టుబాటు ధర వస్తుందో ముందుగా చెప్పే యంత్రాంగం లేదు.

నిజంగా రైతులమీద చిత్తశుద్ధి ఉంటే రాజకీయ ప్రయోజనాలకోసం తాత్కాలిక పథకాలు సరే, కానీ వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించే శాశ్వత పథకాలకు రూపకల్పన చేయాలి. ఇందులో రాజకీయాలు చేయడం ఏమాత్రం ధర్మం కాదు.

  • దామెర్ల సాయిబాబ

తాజా సినిమా వార్తల కోసం:https://www.vaartha.com/news/movies/