నేడు ఢిల్లీ యూనివర్సిటీని సందర్శించనున్న ప్రధాని ..విద్యార్థులకు కీలక ఆదేశాలు

విద్యార్థులు నల్లదుస్తులు ధరించి రావొద్దు..యూనివర్సిటీ ఆదేశాలు

No black dresses, mandatory attendance: Delhi University’s guidelines for PM Modi’s visit

న్యూఢిల్లీః నేడు ఢిల్లీ యూనివర్సిటీని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు యాజమాన్యం కీలక ఆదేశాలు జారీ చేసింది. యూనివర్సిటీ శతాబ్ది వేడుకలకు మోడీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థులెవరూ నలుపు రంగు దుస్తులు ధరించి రావద్దని, అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. ఉదయం 10-12 గంటల మధ్య క్లాసులను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.

హిందూ కాలేజీ, డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ కాలేజీ, జాకిర్ హుస్సేన్ ఢిల్లీ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు కార్యక్రమ లైవ్ టెలికాస్ట్‌కు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. లైవ్ స్ట్రీమింగ్‌లో పాల్గొన్న విద్యార్థులకు ఐదు అటెండెన్స్ పాయింట్లు ఇస్తామని తెలిపింది. విషయం వెలుగులోకి రావడంతో హిందూ కాలేజీ ప్రిన్సిపాల్ అంజు శ్రీవాస్తవ స్పందించారు. తాము అలాంటి నోటీసు ఏదీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. అలాంటిది ఇచ్చినట్టు తనకు తెలియదని పేర్కొన్న ఆమె.. అది నిజం కాదని ఖండించకపోవడం గమనార్హం.

విద్యార్థులందరూ లైవ్ టెలికాస్ట్‌కు హాజరు కావాలని విద్యార్థులు, అధ్యాపకులకు మెయిల్ చేశాను తప్పితే, తప్పనిసరిగా హాజరు కావాలని బలవంతం పెట్టలేదని పేర్కొన్నారు. డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ కాలేజీ కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది. విద్యార్థులు, ఫాకల్టీ, నాన్-ఫాకల్టీ సిబ్బంది అందరూ లైవ్ వెబ్ టెలికాస్ట్ ప్రోగ్రాంకు హాజరు కావాలని ఆదేశించింది.