డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ..

గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్.. డీజీపీ అంజనీ కుమార్ కు లేఖ రాసారు. నన్ను చంపేస్తాం అని బెదిరిస్తు ఫోన్స్ వస్తున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా డీజీపీ కేసు నమోదు చేయటంలేదని లేఖలో పేర్కొన్నారు. 8 నంబర్లతో ఫోన్లు వస్తున్నాయని..పాకిస్థాన్ నుంచి ఫోన్లు చేసి తనను బెదిరిస్తున్నారని వాపోయారు.

జైశ్రీరామ్ అన్న ప్రతిసారీ పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేశారని రాజాసింగ్ గుర్తు చేశారు.. తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ విషయమై ఫిర్యాదు చేసినా కూడా కేసు ఎందుకు నమోదు చేయలేదని రాజాసింగ్ ప్రశ్నించారు. తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలని అభ్యర్ధించినా ఇంతవరకు గన్ లైసెన్స్ ఇవ్వలేదని రాజాసింగ్ చెప్పారు. తనపై కేసులున్నాయనే కారణంగా గన్ లైసెన్స్ ఇవ్వని విషయాన్ని రాజాసింగ్ ఆ లేఖలో ప్రస్తావించారు. కేసులున్నవారికి కూడా గన్ లైసెన్స్ లు ఇచ్చిన విషయాన్ని రాజాసింగ్ ఆ లేఖలో ప్రస్తావించారు.తనకు ప్రాణహాని ఉందన్నారు. తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలని రాజాసింగ్ కోరారు.

వివాదాస్పదా వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే రాజాసింగ్ జైలుకు వెళ్లి వచ్చాక కాస్త కామ్ గానే ఉంటున్నారు. రాజాసింగ్ పై పిడి యాక్ట్ పెట్టి పోలీసులు అరెస్ట్ చేయటం..చర్లపల్లి జైల్లో వుండటం ఆ తరువాత పిడి యాక్ట్ ను ఎత్తివేసిన హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన రాజాసింగ్ అప్పటినుంచి కాస్త కామ్ గానే ఉంటున్నారు. ఈక్రమంలో తనకు ప్రాణహాని ఉందని..తనకు గన్ లైసెన్ ఇవ్వాలని కోరుతున్నారు.